తిరుపతిలో శ్రీవారి నామాల వివాదం

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 01:08 PM IST
తిరుపతిలో శ్రీవారి నామాల వివాదం

తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గాలున్నాయి. వడగలై సంప్రదాయవాదులు శ్రీవారి నామాన్ని ‘యు’ ఆకారంలో దిద్దుతారు. తెంగలై సాంప్రదాయవాదులు శ్రీవారి నామాన్ని ‘వై’ ఆకారంలో దిద్దుతారు. అయితే, అధికారులు మాత్రం వడగలై సాంప్రదాయం ప్రకారం పిల్లర్లపై శ్రీవారి నామాన్ని ముద్రించారు. ఓ పిల్లర్‌కు రంగులు కూడా వేశారు. దీనిపై తెంగలై సాంప్రదాయ వాదుల నుంచి ప్రతిఘటన తప్పదని భావించిన అధికారులు.. వివాదరహితమైన చతురస్త్రాకార నామాల ముద్రను కొత్తగా పిల్లర్లపై వేస్తున్నారు. 

రంగులు వేశాకే వివాదం మొదలు:
సుమారు 684 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గరుడ వారధిలో.. టీటీడీ మెజారిటీ వాటాదారుగా ఉంది. ఈ నిర్మాణ పనులు 2021 మార్చి కల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ముందు అనుకున్న డిజైన్‌లో మార్పులు చేస్తూ పిల్లర్లపై కొత్తగా శ్రీవారి నామాలను ముద్రించాలని టీటీడీ ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఫ్లై ఓవర్‌లోని 36 పిల్లర్లపై శ్రీవారి నామాలను అచ్చు వేశారు. ఇప్పుడిప్పుడే వాటికి రంగులు అద్దడం మొదలుపెట్టారు. రంగులు వేసిన తరువాత చూసిన వారందరూ.. భలేగా ఉందనుకున్నారు. కాని, ఇక్కడే అసలు వివాదం మొదలైంది.

యు కరెక్టా? వై కరెక్టా?
‘యు’ ఆకారపు నామాన్ని ఫ్లైఓవర్ పిల్లర్లపై అచ్చు వేయడం కొత్త వివాదానికి దారితీసింది. నిజానికి తిరుమల కొండపై జియ్యర్లకు, అర్చకులు మధ్య చాలా ఏళ్లుగా నామాల వివాదం కొనసాగుతోంది. వైష్ణవంలో దక్షిణాది వారిని తెంగలై అని, ఉత్తరాది వారిని వడగలై అని వ్యవహరిస్తారు. వైష్ణవాన్ని వ్యాప్తి చేసిన రామానుజాచార్యుల పరంపరగా వస్తున్న జీయర్లు ‘వై’ ఆకారంలో శ్రీవారి నామాన్ని ధరిస్తారు. ఇక వడగలై తెగకు చెందిన అర్చక వైష్ణవులు ‘యు’ ఆకారపు నామాన్ని ధరిస్తారు. ఈ రెండు వర్గాల మధ్య అనేక అంశాల్లో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 

వై, య ఆకారాలను కలుపుతూ కొత్త నామం:
బ్రిటిషర్ల కాలంలో ఈ వివాదం రచ్చకెక్కింది. తిరుమలలో కొలువై ఉన్న ఆ శ్రీనివాసుడికి ఏ తరహా నామం ధరించాలన్న విషయంలో పెద్ద రగడే జరిగింది. అయితే బ్రిటిష్ హయాంలోనే దీనికి పరిష్కారం కనుగొన్నారు. రెండు వర్గాలకు చెందిన వై, యూ ఆకారాలను కలుపుతూ కొత్తగా చతురస్త్రాన్ని పోలి ఉండే ఓ విభిన్న నామాన్ని సృష్టించారు. రెండు వర్గాల ఆమోదంతో నాటి నుంచి సాక్షాత్తూ ఆ శ్రీవారి మూలవిరాట్టు సైతం ఈ చతురస్రాకారపు నామాన్ని ధరిస్తూ వస్తున్నారు. దీనికి మధ్యలో తిలకం ఉంటుంది. శ్రీవారి మూలవిరాట్టు నామాన్ని మారుస్తున్నారంటూ అప్పుడప్పుడూ ఇటు అర్చకులు, అటు జియ్యర్లు పరస్పరం విమర్శలు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి.

ఇప్పుడు ఏం చేస్తారు?
ఓవైపు నామాలపై వివాదం ఉండగానే.. గరుడ వారధి ఫ్లైఓవర్ పిల్లర్లపై వివాద రహిత నామాన్ని కాకుండా.. ‘యూ’ ఆకారపు నామం అచ్చు వేయడం కొత్త వివాదానికి కారణమయింది. ప్రతి పిల్లర్‌పై ఇప్పటికే ‘యు’ ఆకారపు నామాన్ని ముద్రించారు. మొదటి పిల్లర్‌కు రంగులు వేయగానే ఈ వివాదం బయటపడింది. ఇది తెంగలై వర్గానికి చెందిన జియ్యర్లకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. వివాదం ముదరకుండా తాజాగా పిల్లర్లకు మళ్లీ వివాదం రహితమైన చతురస్త్రాకార నామాన్ని ముద్రిస్తున్నారు. మరి ఇప్పటికే ఉన్న యు ఆకారపు పిల్లర్లను కొనసాగిస్తారా లేక అన్నిటినీ మారుస్తారా అన్నది తేలాల్సి ఉంది. విషయం వివాదంగా మారినా.. టీటీడీ పెద్దలెవరు ఈ వ్యవహారం గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు.