2వేల రోగాలకు సేవలు : జనవరి నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు : సీఎం జగన్ 

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 08:42 AM IST
2వేల రోగాలకు సేవలు : జనవరి నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు : సీఎం జగన్ 

జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు.  శుక్రవారం (డిసెంబర్ 20) ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త నిర్మించే  కిడ్నీ, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధులు సమీకరణ, ఖర్చుపై సీఎం  సమీక్షించారు.  

ఈ సందర్భాగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఆస్పత్రుల్లో నాడు -నేడు కోసం డిసెంబర్, జనవరి, మార్చిల్లో మూడు విడతలుగా టెండర్లు నిర్వహించనున్నామని తెలిపారు. జనవరిలో  1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని తెలిపారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా, కిడ్నీ సమస్యలు ఉన్న డయాలసిస్ రోగులకు రూ.10వేల పెన్షన్లు ఇస్తామని తెలిపారు.  బోదకాలు, వీల్ ఛైర్లకు పరిమితమైన బాధితులకు,తీవ్ర పక్షవాతంతో బాధపడేవారికి జనవరి నుంచి పెన్షన్లు ఇస్తామన్నారు.  

అలాగే కుష్టువ్యాధిగ్రస్తులకు నెలకు రూ.3వేల పెన్షన్ ఇస్తామన్నారు.  ఆస్పత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను పెంచుతున్నామని ప్రస్తుతం వారికి ఇచ్చే  రూ.8వేల జీతాన్ని రూ.16వేలకు పెంచుతున్నామని తెలిపారు. మార్చి 2020 నాటికి 1060 కొత్త 104,108 అంబులెన్స్ లను కొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని..మే చివరినాటికి ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు. 

జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ, పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మిగిలిన 12 జిల్లాల్లో కూడా 1200 రోగాలకు ఆరోగ్య శ్రీ వర్తించేలా చేస్తామన్నారు. దీంట్లో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.  

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరోగ్య లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే.. వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను కూడా పొందుపరచాలని తెలిపారు. ఏప్రిల్‌ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం రోగులకు మందులు అందించాలని ఆదేశించారు.  తీవ్ర వ్యాధులతో బాధ పడుతున్నవారికి.. ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పద్ధతి సులభతరంగా ఉండాలని సూచించారు. ఏఎన్‌ఎం సహాయంతో స్లాట్‌ బుక్‌ చేయించి.. వెంటనే పరీక్షలు, సర్టిఫికెట్‌ జారీ చేసేలా చూడలన్నారు. రోగుల కోసం అవసరమైదే ప్రత్యేక వాహన సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు.