చంద్రబాబు ప్రయోగం ఫలించేనా : ఎన్నికల బరిలో కొత్త ముఖాలు

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 06:52 AM IST
చంద్రబాబు ప్రయోగం ఫలించేనా : ఎన్నికల బరిలో కొత్త ముఖాలు

సొంత జిల్లాలో టిక్కెట్ల కేటాయింపులో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరడజను కొత్త ముఖాలను .. ఆయన ఎన్నికల బరిలో దించారు.   ఓవైపు బలమైన ప్రత్యర్ధులు, మరోవైపు అనుభవం లేని నేతలు.. మరి ఈ ప్రయోగం టీడీపీకి కలిసి వస్తుందా.. ప్రత్యర్ధులను మట్టికరిపిస్తుందా.. సొంత జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

రాజకీయ నిర్ణయాలను ఆచితూచి తీసుకుంటారని చంద్రబాబుకి పేరు. సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకోబోయే ముందు .. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని జిల్లా నేతలు చెబుతుంటారు.  ఈసారి చంద్రబాబు కొత్త ప్రయోగం చేశారు. చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో .. తొలిసారి టీడీపీ నుంచి ఆరుగురు కొత్తవాళ్లు బరిలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో .. ఆరు కొత్త ముఖాలకు టీడీపీ చోటు  కల్పించడం చర్చనీయాంశంగా మారింది.

నగరి స్థానం నుంచి గాలి భాను ప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయవారసుడిగా తొలిసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అమెరికాలో ఎమ్మెస్ పూర్తిచేసిన  భానుప్రకాష్.. విదేశాల్లోనే కొంతకాలం ఉద్యోగం చేశారు. 2009, 2014 ఎన్నికల సమయంలో తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు చేదోడువాదోడుగా ఉన్నారు. తండ్రి మరణంతో ఆయన వారసుడిగా ప్రత్యక్ష  రాజకీయాల్లో దిగుతున్నారు. స్వయంగా తల్లి సరస్వతమ్మ, తమ్ముడు గాలి జగదీష్ నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను అధిగమించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు భానుప్రకాశ్. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు  ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాజకీయంగా బలమైన వైసీపీ అభ్యర్ధి రోజాను ఆయన ఈ ఎన్నికల్లో ఢీకొంటున్నారు.

తాత, తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని శ్రీకాళహస్తి స్థానం నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి అయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడిగా ఆయన  నియోజకవర్గానికి సుపరిచితుడు. తండ్రి గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో ఉండడంతో చాలాకాలం నుంచే నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. విద్యావంతుడైన సుధీర్ కి రాజకీయ అవగాహన  ఎక్కువే. నియోజకవర్గ టీడీపీ కేడర్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తండ్రి వారసుడిగా తొలిసారి శాసన సభలో అడుగు పెట్టాలని సుధీర్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు.

రిజర్వు నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నుంచి హరికృష్ణ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ తనయుడైన హరికృష్ణ .. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు.  కుతూహలమ్మ అనారోగ్యం కారణంగా ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నారు హరికృష్ణ. తల్లితో ఇటీవల విభేదాలు వచ్చినా .. చివరకు టికెట్ ఖరారయ్యాక అంతా ఏకమయ్యారు. హరికృష్ణ రాజకీయ భవిష్యత్తు ఈ  ఎన్నికల్లో తేలనుంది.

పుంగనూరు నుంచి టీడీపీ తరపున బరిలో దిగారు అనీషా రెడ్డి. మంత్రి అమర్నాథరెడ్డి సోదరుడైన శ్రీనాథ్ రెడ్డి సతీమణి ఈమె. రాజకీయ కుటుంబానికి చెందిన అనీషా రెడ్డి మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు.  గతంలోనూ 2 సార్లు పార్టీ టికెట్ ఆశించినా.. ఆమెకు అవకాశం దక్కలేదు. ఈసారి అనూహ్యంగా పుంగనూరు అభ్యర్థిత్వాన్ని అధినేత చంద్రబాబు ఆమెకు కట్టబెట్టారు. చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాలను శాసిస్తున్న  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమె పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది.

చిత్తూరు జిల్లాలో మరో ముఖ్య స్థానం చంద్రగిరి. ఇక్కడి నుంచి టీడీపీ తరపున పులివర్తి నాని పోటీపడుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నాని అసెంబ్లీ బరిలో దిగడం ఇదే మొదటిసారి. నియోజకవర్గ  పరిధిలోని పాకాల సర్పంచ్‌గా పనిచేసిన ఆయన తరువాత పార్టీ పదవుల్లో ఉన్నారే తప్ప అసెంబ్లీ బరిలోకి దిగలేదు. నానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో విస్తృతమైన పరిచయాలున్నాయి. అభ్యర్థిగా మారిన కొద్ది  రోజుల్లోనే చంద్రగిరి నియోజకవర్గంపై నాని గట్టి పట్టు సాధించారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన ఈ ఎన్నికల్లో ఢీకొంటున్నారు.

జిల్లాలోని మరో ఎస్సీ నియోజకవర్గం సత్యవేడు నుంచి టీడీపీ తరపున జె.డి రాజశేఖర్ పోటీపడుతున్నారు. ఈయన ఇదివరకు జేడీ ఫౌండేషన్ పేరిట నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ  వచ్చారు. ఇటీవలే టీడీపీలో చేరిన రాజశేఖర్ అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. సత్యవేడు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిత్యను కాదని రాజశేఖర్ వైపు అధినేత చంద్రబాబు మొగ్గు చూపారు. విద్యావంతుడైన  రాజశేఖర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ కంచు కోట అయిన సత్యవేడులో మరోసారి పార్టీ జెండా ఎగురవేస్తాం అని ఆయన ధీమాగా ఉన్నారు

మొత్తం మీద తన సొంత జిల్లాలో ఆరుగురు కొత్త వ్యక్తులకు అభ్యర్థిత్వం కట్టబెట్టడం ద్వారా .. చంద్రబాబు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ నిర్ణయం టీడీపీకి కలిసి వస్తుందో లేక బెడిసికొడుతుందో  చూడాలి.