బస్సు ఎక్కితే బాదుడే : అమల్లోకి కొత్త చార్జీలు

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 03:23 AM IST
బస్సు ఎక్కితే బాదుడే : అమల్లోకి కొత్త చార్జీలు

ఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. డిపోల నుంచి వేకువ జామున బయటికి వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. పల్లె బస్సులు, సిటీ సర్వీసుల్లో కనీస ప్రయాణ చార్జీ ఐదు రూపాయలేనని… వెన్నెల స్లీపర్‌ సర్వీసుల్లో ఎలాంటి పెంపు ఉండబోదని ఆర్టీసీ స్పష్టం చేసింది. దూరప్రాంత ప్రయాణికుల్లో ఎక్కువ మంది ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రతి కిలోమీటరుకు 20పైసలు పెంచిన యాజమాన్యం… తక్కువ సంఖ్యల నడిచే సర్వీసులైన ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో పది పైసలు పెంచింది. దూరప్రాంత ప్రైవేటు బస్సులతో పోటీ తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.

11 స్టేజీల వరకు చార్జీల పెంపు లేదు:

పల్లె వెలుగు, పట్టణ సర్వీసుల్లో కిలోమీటరు దూరానికి పది పైసలు చొప్పున పెంచుతున్నట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సిటీ ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకూ చార్జీల పెంపులేదని స్పష్టం చేసింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో కనీస చార్జీని పది రూపాయలుగా నిర్ణయించారు. ఆర్టీసీకి అప్పుల భారంతో పాటు 1200కోట్ల నష్టాలు వస్తున్నాయని… వాటి నుంచి గట్టెక్కించాలంటే సామాన్యులు ప్రయాణ భారం మోపక తప్పదని మంత్రి నాని చెప్పారు.

ప్రయాణికుల నుంచే టోల్‌ప్లాజా చార్జీలు వసూలు: 

ప్రయాణాల్లో బస్సుల నుంచి టోల్‌ప్లాజా వసూలు చేసే చార్జీలను ప్రయాణికులు భరించాల్సిందేనని ఆర్టీసీ స్పష్టం చేసింది. దీంతోపాటు పాసింజర్‌ సెస్‌, అమెనిటీస్‌, సేఫ్టీ సెస్‌, ఏసీ బస్సుల్లో జీఎస్టీని అదనంగా మోయాల్సిందే. చిల్లర సమస్య లేకుండా బస్సు సర్వీసును బట్టి ఐదు రూపాయలకు రౌండాఫ్‌ చేస్తామని… వెన్నెల స్లీపర్‌ బస్సుల్లో 10 రూపాయల కనీస ధర ఉంటుందని తెలిపింది.

విద్యార్థులపై మరింత భారం:
విద్యార్థులు ఆర్డినరీ బస్సుల్లో విద్యాసంస్థలకు వెళితే ఇప్పటిదాకా ప్రతినెల 130 రూపాయల్ని ఆర్టీసీ వసూలు చేస్తోంది. ఇకపై 155 రూపాయల్ని విద్యార్థులు చెల్లించాలి. స్పెషల్‌ బస్సులు ఎక్కితే వసూలుచేసే 210ని.. 245కు పెంచారు. మూడు నెల పాస్‌కు ఆర్డినరీలో 465… స్పెషల్‌ బస్సుల్లో 735 వసూలు చేస్తారు. ఒక్క రోజుకు ఇచ్చే రూట్‌ పాస్‌ల ధరలు ఐదు రూపాయల నుంచి 15 వరకూ పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఐదు కిలోమీటర్ల లోపల విద్యాసంస్థలు ఉంటే 85… పది కిలోమీటర్లయితే 105కి పెంచారు. 50కిలోమీటర్లయితే 420 చొప్పున నెల పాస్‌కు వసూలు చేయబోతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రతిపక్ష టీడీపీ ఉద్యమబాట పట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టింది.