ఘట్‌కేసర్: ఫార్మశీ విద్యార్ధిని అత్యాచారం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

10TV Telugu News

New version on pharmacy student rape attempt case,Ghatkesar : ఘట్ కేసర్ లో బీఫార్మశీ విద్యార్ధినిపై అత్యాచారం కేసులో పోలీసులకు షాకిచ్చే విషయాలు వెలుగుచూశాయి. ఆటోడ్రైవర్ అతని స్నేహితులు తనపై అత్యాచారం చేసారని ఫిర్యాదు చేసిన యువతి వాస్తవానికి తన బోయ్ ప్రెండ్ తో వెళ్లినట్లు తేలింది.

తనను ఆటో డ్రైవర్లు అపహరించి అత్యాచారం  చేస్తున్నారని పోలీసులను తప్పుదోవ పట్టించిన యువతిని ప్రశ్నించగా విస్తుపోయే విషయాలు వెల్లడించింది. పోలీసులు అందించిన తాజా సమాచారం ప్రకారం.. యువతి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించింది. ఆమె అనుమతితోనే వారంతా ఏకాంతంగా గడిపినట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో,  ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని అబద్దం చెప్పి తల్లిని బోల్తా కొట్టించింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన  పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

స్నేహితులతో కలిసి సన్నిహితంగా ఉన్న ఘట్ కేసర్  ప్రాంతంలో పోలీసు వ్యాన్  సైరన్లు వినిపించడంతో.. భయపడిన యువకులు ఆమెను రహదారి పక్కన  వదిలేసి  వెళ్లి పోయారు. దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు యువతి కనపడింది.  మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

అనంతరం యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. సీసీటీవీ పుటేజి ఆధారంగా సెవెన్ సీటర్ ఆటో డ్రైవర్లను కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు శివ అనే ఆటో డ్రైవర్ ప్రధాన నిందితుడుగా భావించారు. ఆటోడ్రైవర్లను విచారించినా వారి నుంచి తమకేం తెలియదని సమాధానం రావటంతో పోలీసులు మరోసారి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా యువతి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది.

దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు  చేపట్టి యువతిని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆమె అబద్దం చెప్పసాగింది.  ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసారనే చెప్పింది.  పోలీసులు ఆమె వెళ్లిన బైక్ నెంబరు చెప్పటంతో పోలీసులకు విషయం తెలిసిపోయిందని భయపడిన యువతి నిజం ఒప్పుకుంది. తన ఇష్టం తోనే స్నేహితులతో కలిసి యమనంపేట పరిసరాల్లోకి వెళ్లానని చెప్పింది.

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని యువతి ఒప్పుకొన్నట్లు సమాచారం. ఇంటికి ఆలస్యంగా వెళ్లవలసి రావటంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే యువతి డ్రామా ఆడినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు ఆవిషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు.