ఎన్ఐఏ VS సిట్ : కోర్టుకు శ్రీనివాసరావు

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 01:12 AM IST
ఎన్ఐఏ VS సిట్ : కోర్టుకు శ్రీనివాసరావు

విజయవాడ : జగన్‌పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు. అధికార…ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ..దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్‌…ఇప్పుడు విచారిస్తున్న ఎన్‌ఐఏ మధ్య చిచ్చు రేగింది. సిట్ ఏ మాత్రం తమకు సహకరించడం లేదంటూ ఎన్ఐఏ కోర్టు మెట్లు ఎక్కింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎన్ఐఏకు ఎందుకు అప్పచెప్పారంటూ కోర్టుని ఆశ్రయించాలని బాబు సర్కార్ భావిస్తోంది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై హైకోర్టులో పిటిషన్‌ వేయాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ పిటిషన్‌లో పేర్కొననుంది. కోర్టులో కేసు తేలేవరకు ఎన్‌ఐఏకు రికార్డులు ఇవ్వవద్దని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 
సంచలన కోసమే చేశానంటున్న శ్రీనివాసరావు ? 
ఇక జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం విశాఖ కోర్టులో హాజరుపర్చనున్నారు. జనవరి 12వ తేదీన శ్రీనివాసరావు కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ.. రెండు రోజుల పాటు వైజాగ్‌లో, తర్వాత హైదరాబాద్‌లో విచారించారు.  డీఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగింది. 5 రోజుల విచారణలో శ్రీనివాసరావు ఒకే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. తాను సంచలనం కోసమే జగన్‌పై దాడి చేశానని…తన వెనుక ఎవరూ లేరని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కోర్టు అనుమతితో ఏడు రోజులు కస్టడీకి తీసుకున్నప్పటికీ.. ఐదు రోజులకే విచారణ పూర్తి కావడంతో తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.