ఖరీదైన ఎన్నిక : నిజామాబాద్ పోలింగ్ టైం మారింది

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 01:08 AM IST
ఖరీదైన ఎన్నిక : నిజామాబాద్ పోలింగ్ టైం మారింది

ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌లో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్‌ పరిధిలో 2,209 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన… ఏప్రిల్ 08వ తేదీ సోమవారం రైతులు నిర్వహించే ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేశారు.

నిజామాబాద్‌లో ఎక్కువ మంది పోటీలో ఉండడంతో పోలింగ్‌ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్టు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నట్టు వివరించారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 12 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.  ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లపై రైతులు, అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు.  అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలోఉన్నందున ఈ ఒక్క నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లకే దాదాపు 35 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఇది సాధారణ ఖర్చుకంటే 15కోట్ల రూపాయలు అధికమని వివరించారు. 

నిజామాబాద్‌ లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తులన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ప్రచారం కోసం సమయం సరిపోదని, ఎన్నికలు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు కోరారని, దీనిపై ఈసీకి నివేదించామన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వాయిదాకు ఎలాంటి అనుమతి రాలేదని చెప్పారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికల పరిశీలన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నామని సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు. ఎక్కడైనా పోలింగ్‌లో ఇబ్బందులు ఎదురైనా, ఆటంకం కలిగినా నిమిషాల వ్యవధిలో ఉన్నతస్థాయి అధికారుల బృందం అందుబాటులో ఉంటుందన్నారు.