ఎన్ని కేసులు పెట్టినా.. తగ్గేదే లేదు.. రైతులకు సపోర్ట్ చేస్తా..!

ఎన్ని కేసులు పెట్టినా.. తగ్గేదే లేదు.. రైతులకు సపోర్ట్ చేస్తా..!

స్వీడన్‌ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌.. భారతీయ రైతు ఉద్యమానికి తన మద్దతు కొనగిస్తున్నట్లుగా మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె భారత ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తూ గ్రెటా చేసిన ట్వీట్‌ చేయడం తీవ్ర కలకలం సృష్టించగా.. ఈ నెల 13,14 తేదీల్లో భారత రాయబార కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని సూచించారు.

గ్రెటాతో పాటు గాయని రిహానా చేసిన ట్వీట్‌తో అంతర్జాతీయంగా భారత రైతుల ఆందోళన చర్చనీయాంశం అవ్వగా.. దీనిపై కేంద్రం సీరియస్‌ అవుతోంది. ఈ క్రమంలోనే గ్రెటాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. నేరపూరిత కుట్ర, వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రేరిపిస్తున్నారంటూ గ్రెటాపై అభియోగాలు మోపుతూ కేసు పెట్టారు.

దీంతో వెనక్కి తగ్గవచ్చని అందరూ భావించగా.. తనపై కేసు నమోదయ్యాక కూడా గ్రెటా థన్‌బర్గ్‌ స్పందించారు. తానిప్పటికీ రైతుల పక్షాన నిలబడి ఉన్నానని, నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బెదిరింపులు తన నిర్ణయాన్ని మార్చలేవంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటే స్టాండ్ విత్‌ ఫార్మర్స్‌, ఫార్మర్స్‌ ప్రొటెస్ట్‌ వంటి హ్యాష్‌ ట్యాగ్‌లనూ పంచుకున్నారు.

మరోవైపు రైతు సంఘాల ఆందోళనలు, అంతర్జాతీయ ప్రముఖుల మద్దతును ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైతులు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నవారిని కట్టడి చేసే చర్యలను ప్రారంభించింది. హస్తిన సరిహద్దుల్లో రైతు ఉద్యమంతో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది.