కృష్ణానది.. జల గండం

  • Published By: chvmurthy ,Published On : April 20, 2019 / 02:01 AM IST
కృష్ణానది.. జల గండం

కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే కృష్ణానదిలో నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపోయాయి.  ఫలితంగా నదిలో ఇసుక తిన్నెలు బయటకు కనిపిస్తుండటం ప్రమాద ఘంటికలను తెలియజేస్తోంది. బెజవాడ కనకదుర్గను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దుర్గాఘాట్‌లో పుణ్యస్నాలు  ఆచరించేందుకు కూడా నీరులేకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 13 లక్షల 80వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. బ్యారేజీకి ఎడమవైపున ఉన్న కృష్ణా తూర్పు ప్రధాన కాలువ ద్వారా….. కృష్ణా , పశ్చిమగోదావరి జిల్లాలకు నీరు విడుదలవుతుంది. ఇక కృష్ణానది పశ్చిమ ప్రధాన కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పంటలసాగు, ప్రజల తాగునీటి అవసరాల కోసం కృష్ణానది నీటిని విడుదల చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ నీటిపై ఆధారపడే పంటలు సాగు చేసుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

ప్రస్తుతం కృష్ణానదిలో నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు బోర్లపై ఆధారపడుతూ నానా కష్టాలు పడుతున్నారు. ప్రజలు కూడా తాగునీటి అవసరాలకు బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు కూడా అథపాతాళంలోకి వెళ్లిపోయాయి. గత ఏడాది ఖరీఫ్ వర్షాలు బాగానే కురిసినా ఆ తర్వాత నుంచి వర్షాల జాడే లేదు. జిల్లాలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 996.9 మిల్లీ మీటర్లుకాగా ఈ ఏడాది 800.5 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసినట్టు నీటిపారుదలశాఖ గణన అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు  ప్రస్తుత వేసవితాపంతో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. గత ఏడాది 2018 ఏప్రిల్‌లో కృష్ణా జిల్లాలో భూగర్భ జలాలు 12.25 మీటర్లుండగా ప్రస్తుతం 11 మీటర్లకు పడిపోయింది. దీంతో జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఎంత లోతుకు బోర్లు వేస్తున్నా నీరు పడకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ దగ్గర గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులు కాగా ప్రస్తుతం కృష్ణానది నీటి మట్టం 6.2 అడుగులకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణానదిలో నీటిమట్టం 5.4 అడుగుల మేర తగ్గింది. అంతేకాదు ఎండ తీవ్రతకు రోజుకు ఒక సెంటీమీటరు చొప్పున నదిలో నీరు ఆవిరైపోతుందని అధికారులే చెబుతున్నారు. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మే, జూన్‌ లలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ నీటి కష్టాలను ప్రజలకు కలగనివ్వబోమని చెబుతున్నారు. అవసరమైతే రైతుల బోర్ల నుంచి నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. 

మొత్తానికి కృష్ణానదిలో నీటిమట్టం తగ్గడం ప్రమాద ఘంటికలను సూచిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు తాగునీరు కూడా దొరకని పరిస్థితులు దాపురించనున్నాయి. మీరి ఈ నీటి సమస్యను అధికారులు ఎలా తీర్చుతారో చూడాలి.