ఎట్టకేలకు పడవను బయటకు తీసిన అధికారులు

  • Published By: chvmurthy ,Published On : August 25, 2019 / 12:09 PM IST
ఎట్టకేలకు పడవను బయటకు తీసిన అధికారులు

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్లను రప్పించారు. పడవ తొలగింపునకు రెండు లాంచీలు, రెండు భారీ క్రేన్లు, 50 ఎంఎం స్టీల్‌ రోప్‌ను వినియోగించారు. పడవకు రంధ్రాలు వేసి వాటికి స్టీలు తాళ్లు కట్టి బయటకు లాగారు. ఈ పడవను బయటకు తీసేందుకు సుమారు 60 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

పడవకు రంధ్రాలు చేసి ఇనుపతాడు సాయంతో బయటకు తీశారు. దీనికోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నుంచి వచ్చిన ఇంజనీర్లు బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కృష్ణా నదికి వరద  వచ్చిన  సమయంలో… వరద ఉధృతికి కొట్టుకువచ్చిన పడవ ప్రకాశం బ్యారేజ్‌ 68వ గేటుకు అడ్డంపడింది. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినప్పటికీ పడవ అడ్డుగా ఉండటంతో 68వ గేటు మూసివేత కుదరలేదు. ఫలితంగా పెద్ద మొత్తంలో నీరు వృథాగా కిందికి పోయింది. ఎగువ ప్రాంతం నుంచి 22 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండటంతో ఈ పడవను తొలగించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.  

5 రోజులుగా ఆ పడవను తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆగస్టు25, ఆదివారంనాడు బ్యారేజ్‌కు ఎటువంటి నష్టం కలుగకుండా బెకెమ్‌ కంపెనీ ఇంజినీర్ల సాయంతో పడవను తొలగించారు. ఎలాంటి నష్టం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజగా పడవను అక్కడి నుంచి తొలగించడంతో గేటు మూసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.