ఔరా..ఆక్రోబాటిక్ అతివ..కాళ్లతో బాణాలు వేస్తున్న యువతి

  • Published By: nagamani ,Published On : September 22, 2020 / 11:54 AM IST
ఔరా..ఆక్రోబాటిక్ అతివ..కాళ్లతో బాణాలు వేస్తున్న యువతి

విలువిద్యలు..యుద్ధ విద్యల్లో పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చరిత్ర యుద్ధాలలో విజయకేతనాలు ఎగురువేసిన రాణులు చాటి చెప్పారు. రాజ్యాలను ఏలిన రాణులు యుద్దాల్లో విజయదుంధుభి మ్రోగించినవారు ఎందరో ఉన్నారు. ఇది చరిత్ర. రాజ్యాలు పోయాయి. రాచరికాలు పోయాయి. కానీ ప్రతిభ మాత్రం చరిత్రలో కలిసిపోదు..ఎన్నటికీ వెలుగుతునే ఉంటుంది.


నేటి ఆధునిక యుగంలో మహిళల ప్రతిభ మరింత ప్రత్యేకతలను సంతరించుకుంది. ఆనాటి వీరవనితలు తమ చేతిలోని విల్లులతో..అస్త్రశస్త్రాలనుఅవలీలగా సంధిస్తే..నేటి ఓ ఆధునిక యువతి ఏకంగా కాళ్లతో బాణాలు వేసేస్తూ..ఔరా…ఏమి ఈ పడతి చాతుర్యం..ప్రతిభ అని ఆశ్చర్యపరుస్తోంది.


బాణాన్ని కాలితో ఎక్కుపెట్టటమే కాదు ఏకంగా జిమ్మాస్టిక్ చేస్తూ కాళ్లతో బాణాలు వేసేస్తోంది వు తియాంజెన్ అనే యువతి. అదికూడా కాళ్లను వెనకవైపు నుంచి పైకెత్తి గురి తప్పకుండా బాణాన్ని సంధిస్తోంది. జిమ్నాస్టిక్ విన్యాసాలకు పెట్టింది పేరుగా నిలిచిన చైనాలో వు తియాంజెన్ అనే యువతి ఈ అరుదైన అద్భుతమైన విన్యాసాలు చేస్తూ..అబ్బుర పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


వు తియాంజెన్ అనే అమ్మాయి ఆక్రోబాటిక్ విన్యాసాలు చేసింది. ఆమె కళాత్మక నైపుణ్యం చూసి ఆమె శరీరంలో స్ప్రింగులు ఏమైనా ఉన్నాయా, అసలు ఎముకలే లేనా అవి అని ఆశ్చర్యపడటం చూసినవారి పనిగా మారింది. కళ్లార్పకుండా చేస్తోంది. ఎంత సాధన చేసినా..రెండు చేతులతోనే బాణం వేసినా ఒక్కోసారి గురి తప్పుతుంది.. అటువంటిది కాళ్లు పైకెత్తి బాణం వదిలితే అస్సలు గురితప్పకుండా వేస్తున్న ఈ లేడీది లేటెస్ట్ టాలెంట్ అంటు ప్రశంసిస్తున్నారు.


ఉత్తర చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్‌కు చెందిన వు తియాంజెన్ అత్యంత క్లిష్టమైన ఆక్రోబాటిక్ విన్యాసాలను సైతం అలవోకగా చేసిపారేస్తోంది గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడం వు తియాంజన్ కు మాత్రమే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. మరోవైపు సైకిల్ పైనా ఆమె చేసే విన్యాసాలు అందరినీ ఔరా అనిపిస్తున్నాయి. కాగా, ఒలింపిక్స్ నుంచి ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ షిప్ వరకు రష్యా ఆధిపత్యంగా సాగింది. రష్యాను సవాల్ చేసి, జిమ్మాస్టిక్‌లో పైచేయి సాధించడం చైనాకే చెల్లింది. ఈ క్రమంలో వు తియాంజెన్ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా కాళ్లతోనే బాణాలు వేస్తూ..ఔరా..అనిపిస్తోంది.