మాజీ సీఎం బంధువు హత్యకు కారణం సవతి తల్లే!

మాజీ సీఎం బంధువు హత్యకు కారణం సవతి తల్లే!

Siddharth Devendar Singh:కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ సోదరుడు దేవేందర్‌ సింగ్‌ కుమారుడు సిద్ధార్థ సింగ్‌ (28) మర్డర్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ సింగ్‌ సవతి తల్లి ఇందూ చౌహాన్‌ ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అమృతహళ్లి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సిద్ధార్థ తండ్రి దేవేందర్‌ సింగ్‌కు ఇందూ చౌహాన్‌ రెండో భార్య కాగా.. తిరుపతికి చెందిన శ్యామ్‌సుందర్‌ రెడ్డి, వినోద్‌లకు ఆమె కిరాయి ఇచ్చి హత్య చేయించింది.

విచారణలో ఈ విషయం వెలుగులోకి రాగా.. ఆమెను అరెస్ట్ చేసినట్లుగా బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ బాబా వెల్లడించారు. బుధవారం రాత్రే ఆమెను పోలీసులు నిర్బంధించి, న్యాయస్థానం ముందు హాజరు పరిచి అరెస్టు చేశారు. జనవరి 19న సిద్ధార్థ సింగ్‌ను అపహరించి, కారులోనే సీటు బెల్టుతో గొంతుకు ఉరి వేసి నిందితులు హత్య చేయగా.. అనంతరం నెల్లూరు జిల్లాకు తీసుకువెళ్లి రాపూరు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు.

అక్కడి తహసీల్దారు సమక్షంలో శవాన్ని వెలికి తీసి, పంచనామా చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమెరికాలో చదువుకున్న సిద్ధార్థ అమృతహళ్లి పరిధిలోని దాసరహళ్లి అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండేవారు. హత్య వెనుక మరికొందరి హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు పోలీసులు.

సిద్ధార్థ్‌‌ను మర్డర్‌ చేసిన తర్వాత ఇద్దరు అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లగా.. తర్వాత జనవరి 29న శ్యామ్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. వినోద్‌ రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ రెండు ఘటనలు ఎవరి వల్ల జరిగాయన్నదే ఇప్పుడు తేలని అంశం‌. అది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అటు ఊపిరాడకుండా గొంతు బిగించడం వల్లే సిద్ధార్థ్‌ చనిపోయాడని పోస్టమార్టమ్‌లో తేలింది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా అసలు విషయాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.