దైవ దూషణ చేశాడని ఆరోపణతో ముస్లిం వ్యక్తిని కోర్టులోనే కాల్చి పడేసిన ఉన్మాది

  • Published By: nagamani ,Published On : July 30, 2020 / 10:45 AM IST
దైవ దూషణ చేశాడని ఆరోపణతో ముస్లిం వ్యక్తిని కోర్టులోనే కాల్చి పడేసిన ఉన్మాది

ఇస్లాం మతంలో మానవ సంబంధాల కంటే దైవానికే ఎక్కువగా విలునిస్తుంటారు. ఇస్లాం మతంలో దైవదూషణ చేస్తే ఘోరాతి ఘోరమైన పాపంగా భావిస్తారు. అలా దైవదూషణ చేస్తే ఎంత ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందో ఊహించుకుంటేనే భీతిగొలుపుతుంది. ఓ మత పెద్ద దైవ దూషణ చేసాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై కోర్టులో పిటీషన్ వేయటం కోర్టు అన్ని విచారణకు రమ్మని ఆదేశించటంతో సరదు మత పెద్ద కోర్టుకు హాజరయ్యాడు.

కానీ అతను దైవ దూషణ చేసినట్లుగా నిరూపించబడలేదు. కేవలం విచారణకు మాత్రమే వచ్చాడు. కానీ ఇంతలోనే ఓ యువకుడు విచారణకు వచ్చిన మతపెద్దను కోర్టులోనే తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పెషావర్ పట్టణంలోని కోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పాకిస్థాన్‌లో దైవ దూషణను ఎంత తీవ్రంగా పరిగణిస్తారో మరోసారి రుజువైంది.

వివరాల్లోకి వెళితే..తాహిర్ షమీమ్ అహ్మద్ అనే ఇస్లాం మత పెద్ద దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటూ పెషావర్ కోర్టుకి హాజరయ్యాడు. విచారణ కోసం కోర్టు రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో సడెన్ గా ఆ రూమ్ లోకి వచ్చిన ఖలీద్ ఖాన్ అనే యువకుడు తాహిర్ షమీమ్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తాహిర్ షమీమ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

కాగా..తాహిర్ పై రెండేళ్ళ క్రితం దైవ దూషణ కేసు నమోదైంది. దైవ దూషణ ఆరోపణలు నిజమని నిర్థరణ అయితే, దోషికి పాకిస్థాన్ చట్టాల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించవచ్చు. కానీ ఇంతలోనే ఖలీద్ ఖాన్ ఉన్మాద చర్యతో కోర్టులోనే తాహిర్ ను కాల్చి చంపేశాడు. దీంతో షాక్ అయిన పోలీసులు వెంటనే ఖలీద్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే మైనారిటీలను బెదిరించేందుకు..వ్య‌క్తిగ‌తంగా వారిపై ఉండే క‌క్ష‌లు తీర్చుకునేందుకు ఇలా దైవ‌దూష‌ణ చేశారని ఆరోపించి వాటినే ఆసరాగా చేసుకుని ఇటువంటి ఘోరమైన చర్యలకు పాల్పడుతుంటారని పాకిస్తాన్ లో ఉన్న అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్తలు తెలిపారు.