పల్లెల్లో ఎన్నికల  చిచ్చు : 16మంది వెలి

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 03:29 AM IST
పల్లెల్లో ఎన్నికల  చిచ్చు : 16మంది వెలి

బయ్యారం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కులా మధ్యా..బంధాల మధ్యా..మనుష్యుల మధ్యా చిచ్చుపెడుతున్నాయి. ఓట్లు వేయలేదనీ..అందుకే తమ పార్టీ నేతలు ఓడిపోయారనే కక్ష పెంచుకుని ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పంచాయితీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారనే వంకతో మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలను న్యూడెమోక్రసీ నాయకులు వెలివేశారు. 
దీంతో వారు జనవరి 25న పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.  గ్రామ పంచాయతీగా కొత్తగా ఏర్పడిన కాచనపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముడిగ వజ్జయ్య, కాంగ్రెస్‌ నుంచి భూక్యా రమేశ్, న్యూడెమోక్రసీ పార్టీ నుంచి కొట్టెం వెంకటేశ్వర్లు పోటీ చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన ముడిగ వజ్జయ్య న్యూడెమోక్రసీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు.

దీంతో గ్రామంలో చిచ్చురేగింది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రమేశ్, వజ్జయ్యకు మద్దతు ఇవ్వడం వల్లనే తమ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యాడని ఆరోపిస్తూ న్యూడెమోక్రసీ సర్పంచ్‌ అభ్యర్థి కొట్టెం వెంకటేశ్వర్లుతో పాటు కొట్టెం రామారావు, సీతారాములు, రమేశ్‌ తదితరులు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలైన కొట్టెం పాపారావు, కొట్టెం చిన్నవెంకన్న, కొట్టెం లక్ష్మయ్య, కృష్ణ, రాందాస్, పాపారావుతో పాటు పలువురిని వెలివేశారు. అంతేకాదు..వారు గ్రామస్థులతో మాట్లాడకూడదనీ..గ్రామస్థులు కూడా వారితో మాట్లాడకూడదని ఒకవేళ మాట్లాడినా..తాగటానికి నీళ్లిచ్చినా.. తమ పశువులను తోలుకెళ్లినా రూ.15 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారని బాధితులు పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై కాచనపల్లికి చెందిన 16 కుటుంబాల వారు బయ్యారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.