జగన్ రెడ్డే అంటాను.. కడుపు మండిన యువత రాయలసీమలోనే ఎక్కువ: పవన్ కళ్యాణ్.

జగన్ రెడ్డే అంటాను.. కడుపు మండిన యువత రాయలసీమలోనే ఎక్కువ: పవన్ కళ్యాణ్.

ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అడ్డా అయిన కడప జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జగన్‌కు ఏకపక్షంగా విజయం అందించిన కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరుకు వెళ్లిన పవన్ కళ్యాణ్..  రాయలసీమ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పైన ఎటువంటి విమర్శలు గుప్పించారు. రాయలసీమ గొప్పదనం మనం పేపర్లోనే చదువుకుంటున్నాం అని వాస్తవానికి రాయలసీమలో చూసిన ఆవేదన, ఆవేశం, కడుపు మండిన యువత ఇక ఎక్కడా ఉండరని అన్నారు పవన్ కళ్యాణ్. 

రాయల సీమలో కరువు అసలు లేదని, కరువు సృష్టించబడిందని అన్నారు పవన్ కళ్యాణ్. నాయకత్వం లోపం కారణంగా కృత్రిమ కొరత రాయలసీమలో వచ్చిందని అన్నారు. రాయలసీమ నుంచే అందరు ముఖ్యమంత్రులు అయినా కూడా జగన్ రెడ్డి గారితో సహా.. రాయలసీమను పట్టించుకోట్లేదని అన్నారు పవన్ కళ్యాణ్. 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా? అని వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని అన్నారు పవన్ కళ్యాణ్.

తాను జనసేన పార్టీ పెట్టింది యువతలో ధైర్యం నింపడానికే అని చెప్పిన పవన్ కళ్యాణ్, జగన్ రెడ్డి రాయలసీమకు ఉక్కు కర్మాగారంను అడగకుండా కేంద్రంలోని పార్టీ దగ్గరకు వెళ్లి, అణు శుద్ధి కేంద్రం కోరారని విమర్శించారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో తనని ముఖ్యమంత్రి అనలేదని జగన్ రెడ్డి ఫీల్ అవుతూ ఉంటారని,  జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి అంటానని అన్నారు. అప్పటివరకు జగన్ రెడ్డే అని అంటాను అన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి పద్దతులు మార్చుకోవాలని హితవు పలికారు.