సీఎం కావాలని పగటి కలలు కనలేదు : బెంబేలెత్తే వ్యక్తిని కాదు

  • Published By: madhu ,Published On : October 24, 2019 / 01:17 AM IST
సీఎం కావాలని పగటి కలలు కనలేదు : బెంబేలెత్తే వ్యక్తిని కాదు

తన అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బెంబేలెత్తే వ్యక్తిని తాను కాదని చెప్పారు. సీఎం కావాలనే పగటి కలలను తాను కనలేదన్నారు. తన ఒక్కడి గుర్తింపు, విజయం ఎప్పుడూ కోరుకోలేదని చెప్పారు. 25ఏళ్ల కమిట్‌మెంట్‌తో రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు పవన్‌.
చాలా ఆశయాలతో తాను రాజకీయాల్లోకి వచ్చానని… డబ్బు, సారా పంచని స్థాయికి రాజకీయాలను తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు.  అమరావతిలో ప్రకాశం జిల్లా జన సైనికులతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. జగన్‌ ప్రభుత్వంపై పవన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇసుక మాఫియా రాష్ట్రంలో రెచ్చిపోతోందన్నారు. ఇసుక మాఫియాను గతంలో టీడీపీ ప్రోత్సహిస్తే.. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఉన్న ఇసుక తెలంగాణకు వెళుతుందని, కానీ ఆంధ్రాలో దొరకడంలేదని విమర్శించారు. ఏపీలో అనేకమంది కార్మికులు భవన నిర్మాణాలపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇసుక కొరతవల్ల వాళ్లంతా కష్టాలుపడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 3న విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం భారీ ర్యాలీ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓటమిపైనా పవన్‌ మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓడిపోయినంత మాత్రానా తాను బెంబేలెత్తే వ్యక్తిని కాదని చెప్పారు. గెలుపే ఆదర్శమనుకుంటే వంద వ్యూహాలు పన్నైనా… గెలిచేవాడినని తెలిపారు.  బలమైన భావజాలం, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నీతి, నిజాయితీ ఉండేవారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. డబ్బు, మద్యం అవసరంలేని స్థాయికి రాజకీయాలను తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. ఏదో అద్భుతాలు జరుగతాయని తాను జనసేన పార్టీని ఏర్పాటు చేయలేదని పవన్‌ అన్నారు. మొత్తానికి పవన్‌ ప్రభుత్వంపై పోరుకు రెడీ అవుతున్నారు. పార్టీ నిర్మాణంతోపాటు.. ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు జనసైనికులను సమాయాత్తం చేసే పనిలో పడ్డారు.
Read More : వాలంటీర్లకు వార్నింగ్ : జీతంలో రోజుకు రూ.166 కట్