మాజీ మంత్రి దారెటు.. టిక్కెట్ కూడా దక్కలేదు

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 05:24 AM IST
మాజీ మంత్రి దారెటు.. టిక్కెట్ కూడా దక్కలేదు

మంత్రి పదవీ పోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత పరిస్థితి ఇది. సమీకరణాల నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న పీతల సుజాత.. తర్వాతి కాలంలో మంత్రి పదవిని కోల్పోయింది.

అయితే కనీసం అసెంబ్లీ టిక్కెట్ అయినా దక్కుతుందిలే అని భావించిన ఆమెకు ఇటీవల విడుదల చేసిన తెలుగుదేశం తొలిలిస్ట్‌లో చోటు దక్కలేదు. మాజీ మంత్రి పీతల సుజాతకు చంద్రబాబు మొండి చేయే చూపించినట్లైంది. 2004లో ఆచంట నుంచి తొలి సారి టీడీపీ తరపున పోటీ చేసిన సుజాత విజయం సాధించారు. 2009లో జిల్లాలో చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం మూడు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు ఉన్నా ఆమెకు సీటు దక్కలేదు. అయితే 2014లో మాత్రం నెగ్గి మంత్రి అయ్యింది.

అయితే మంత్రి అయిన తర్వాత తొలి మూడేళ్లలో అందరినీ కలుపుకుని పోలేకపోవడంతో ఆమెకు ఏలూరు ఎంపీ మాగంటిబాబుతో సహా పలువురు మద్దతు లభించలేదు. దీంతో రాజ‌కీయ ఆధిపత్యం విషయంలో నియోజకవర్గ తెలుగుద తమ్ముళ్లు సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాలుగా చీలిపోయారు. చింతలపూడి పక్కనే ఉన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోనూ ఆమెకు గ్యాప్‌ ఏర్పడి ఉంది. చివరకు వీళ్లు చ‌క్రం తిప్పిన క్రమంలో ఆమె 2019ఎన్నికలరకు సీటు కూడా దక్కలేదు.

అయితే మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహించిన కోవూరు నుంచి ఆమెకు టిక్కెట్ ఇస్తారని ఆమె భావించారు. అయితే అక్కడి నుంచి అనితకు అవకాశం దక్కింది. చింతలపూడి నుంచి కర్రా రాజారావుకు టిక్కెట్ ఇవ్వడం.. కోవూరు నుండి అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపంకు గురైనట్లు తెలుస్తుంది. ఈక్రమంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆమెకు కార్యకర్తల నుండి ఒత్తిడి రావడంతో ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయమై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. పీతల సుజాత ఫోన్ గత రెండు రోజులుగా పని చేయట్లేదని చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రి దారెటు అని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.