ఫొని తుఫాన్ ప్రభావం : 103 రైళ్లు రద్దు

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 02:05 AM IST
ఫొని తుఫాన్ ప్రభావం : 103 రైళ్లు రద్దు

ఫొని పెను తుఫాన్‌ బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తోంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం (మే1, 2019)  ఉదయం వరకు వాయువ్యంగా పయనించిన ఫొని తుఫాన్‌ దిశను మార్చుకుంది. ఉత్తర వాయువ్యంగా.. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంది.
Also Read : Cyclone Warning : ఉత్తరాంధ్రపై ఫోని పడగ

ఈ క్రమంలో కొన్ని గంటలపాటు నెమ్మదిగా కదిలి మరింత బలపడింది. తుఫాన్‌ విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశగా 320 కిలో మీటర్ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570 కిలో మీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అయితే బుధవారం నుంచి ఉత్తర ఈశాన్యంగా పయనిస్తున్న తుఫాన్‌.. నెమ్మదిగా ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉంది. 

గురువారం (మే 2, 2019) తేదీకి ఉత్తర కోస్తా తీరానికి దగ్గరగా రానుంది. శుక్రవారం (మే 3, 2019) మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌ – చాందబలి మధ్య తీరం దాటే అవకాశముంది. తుఫాన్ ప్రభావంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు నిలిచిపోయాయి.

ఫొని తుఫాను ప్రభావంతో భారతీయ రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లో 103 రైళ్లను రద్దు చేసింది. రెండు రైళ్లను దారి మళ్ళించారు. రైళ్లను రద్దు చేయడానికి లేదా నియంత్రించడానికి తూర్పు తీర రైల్వే ఇప్పటికే సూచనలు చేసింది.

తత్ఫలితంగా, భద్రాక్-భువనేశ్వర్-పూరీ-విశాఖపట్నం మధ్య ఉన్న మొత్తం విభాగాన్ని క్లియర్ చేశారు. దక్షిణ తూర్పు రైల్వే నుండి భువనేశ్వర్, పూరి, విశాఖపట్నం మరియు ఇతర ప్రాంతాల దక్షిణ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్ళు రద్దు చేయబడతాయి.