పాంచ్ పటాక : ఆసక్తికరంగా పలాస పొలిటిక్స్

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 09:21 AM IST
పాంచ్ పటాక : ఆసక్తికరంగా పలాస పొలిటిక్స్

అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్ 
2014 ఎన్నికల్లో గౌతు శ్యాం సుందర్ శివాజీ గెలుపు
కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించిన శివాజీ
జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న శిరీష

శ్రీకాకుళం  : పలాస రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా….కొత్త వ్యక్తే అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. గౌతు శ్యాం సుందర్ శివాజీ పోటీ చేయనని ప్రకటించడంతో…ఆయన కూతురు శిరీష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అటు వైసీపీ నుంచి వజ్జ బాబూరావు అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం.

 

శ్రీకాకుళం జిల్లా పలాస అంటే జీడిపప్పుకు ఫేమస్. అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు పేటెంట్ ఉంది. అదే స్థాయిలో ఇక్కడి రాజకీయాలు అంతలా ప్రాచుర్యం పొందాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన గౌతు శ్యాం సుందర్ శివాజీ…వైసీపీ అభ్యర్థి వజ్జ బాబూరావుపై 17వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా మంచి పేరుంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడమే కాకుండా…తన కుమార్తె శిరీషను వారసురాలిగా ప్రకటించారు. శిరీష జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా నియోజకవర్గంలో తిరుగుతూ…క్యాడర్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు.

 

వైసీపీ తరపున మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. అప్పలరాజు కొన్నేళ్లు వైద్య వృత్తి ద్వారా ప్రజలకు చేరువై…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం ఛైర్మన్ కోత పూర్ణచంద్రరావు….టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ తరపున మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారదలు టికెట్ ఆశిస్తున్నారు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు బరిలోకి దిగుతుండటంతో ఓట్లు భారీగా చీలే అవకాశాలు ఉన్నాయి.

30 ఏళ్లుగా తండ్రి రాజకీయ జీవితం, జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం…ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గెలిపిస్తాయని శిరీష విశ్వాసంతో ఉన్నారు. సర్కార్ వైఫల్యాలు, వైసీపీ మీద ప్రజల్లో ఉన్న నమ్మకమే తనను గెలిపిస్తుందని డాక్టర్ అప్పలరాజు ధీమాతో ఉన్నారు. ఇలా ఎవరికి వారు తమ పార్టీకి అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఐదు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలుపొందినా…కొత్త వ్యక్తే తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.