జనసేనకు రాజు రాజీనామా: పార్టీకి బిగ్ లాస్.. ఆమోదించిన పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : December 14, 2019 / 03:07 AM IST
జనసేనకు రాజు రాజీనామా: పార్టీకి బిగ్ లాస్.. ఆమోదించిన పవన్ కళ్యాణ్

అతనొక్కడే.. అన్నీ తానై అన్నింటా తానై.. ఒక్కడిగానే ప్రజల్లోకి వెళ్లడాన్ని ఆ పార్టీ నేతలే భరించలేక పోతున్నారు. ఈ క్రమంలోనే కీలక నేతలు కూడా జనసేన పార్టీకి దూరం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టినప్పుడు కీలకంగా వ్యవహరించిన ఎందరో నేతలు దూరం అవ్వగా.. లేటెస్ట్‌గా తన రాజకీయ భావాలు పెంపొందించుకోవడానికి పిల్లర్‌గా ఉపయోగపడిన రాజు రవితేజను దూరం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ, సామాజిక అధికారం దక్కించుకోవడానికి అనర్హుడని, రాజకీయాలకు పనికిరాడని సంచలన ప్రకటన చేసి పార్టీకి దూరం అయ్యాడు జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజు రవితేజ. ఉన్నత భావాలతో రాజకీయ పార్టీని ప్రారంభించిన పవన్ ఇప్పుడు రాజకీయ విధ్వంసకర శక్తిగా కుల, మత రాజకీయాలకు పాల్పడే నేతగా మారిపోయారని మండిపడ్డారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ప్రమాదకరంగా మారాడని, రాజురవితేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేయబోనని ప్రకటించారు.

జనసేన పార్టీ కార్యకర్తలందరికీ రాజు రవితేజ పరిచయమైన, దగ్గరగా ఉన్న వ్యక్తి. తాను రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రేరణ ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రాజు రవితేజ అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి రాజు రవితేజ జనసేన పార్టీలో కీలకంగా ఉంటున్నారు. జనసేన పార్టీ రాజ్యాంగం అయిన పవనిజం పుస్తకాన్ని రాసిన వ్యక్తి కూడా రాజు రవితేజనే. జనసేన పొలిట్‌బ్యూరో సభ్యునిగా తెర వెనుక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే రాజు రవితేజ పార్టీకి దూరం అవ్వడం ఆ పార్టీకి బిగ్ లాస్ అని అంటున్నారు.

పవన్‌ని అమితంగా ఆరాధించే రాజు రవితేజ అంత కంటే ఎక్కువ స్థాయిలో ద్వేషించడానికి కారణం, పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవడమే అని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మత పరమైన ఆరోపణలు చేస్తుండడం.. ఢిల్లీకి వెళ్లి రహస్య చర్చలు జరిపి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందనే అభిప్రాయం ఎక్కువగా ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు రాజు రవితేజ, ట్రెజరర్ రాఘవయ్య మాత్రమే పార్టీలో ఉండేవారు.

ఇక రాజు రవితేజ రాజీనామాను జనసేన పార్టీ గౌరవంగా ఆమోదించింది. రాజు రవితేజ రాజీనామాను ఆమోదిస్తునట్టు జనసేన అధికారకంగా ట్విట్టర్ వేదికగా స్పందించింది. “జనసేన పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీ రాజు రవితేజ గారు పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాం. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నాము. గతంలో కూడా అయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగ చేయాలని ఆ జగన్మాతను ప్రార్టిస్తున్నాను.” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా లేఖను విడుదల చేసింది.