సీడబ్ల్యూసీ హెచ్చరికలు. : శ్రీశైలం, సాగర్ గేట్ల ఎత్తివేత

  • Published By: madhu ,Published On : October 23, 2019 / 03:52 AM IST
సీడబ్ల్యూసీ హెచ్చరికలు. : శ్రీశైలం, సాగర్ గేట్ల ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి భారీ వరద వస్తోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఈ వరద 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారానికి మరింత పెరిగే అవకాశముంది. దీంతో తెలుగు రాష్ట్రాలను సీడబ్ల్యూసీ హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది.

ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఆనకట్ట గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం ఈ సీజన్‌లో ఇది ఏడోసారి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి  మూడు లక్షల 73వేల  క్యూసెక్కుల  వరద వస్తోంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో వరద మళ్లీ పెరిగింది.జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటంతో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని నియంత్రిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వస్తున్న వరదను కాలువలకు విడుదల చేస్తూ మిగులు ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలానికి ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఇప్పటి వరకు శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,236 టీఎంసీల వరద వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరదతో తెలుగు రాష్ట్రాల్లోని ఎత్తిపోతల పథకాలకు సమృద్ధిగా నీరందింది. సీమ ప్రాంతానికి వెళ్లే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 130.32 టీఎంసీలు, హంద్రీనీవాకు 12.37 టీఎంసీలు, ముచ్చుమర్రికి 0.40 టీఎంసీలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్వకుర్తి ఎత్తిపోతలకు 15.04 టీఎంసీలు విడుదలయ్యాయి.మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా 717.01 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 4 నెలల వరకే వరద ప్రవాహం శ్రీశైలానికి రావడం సర్వసాధారణం. ఈ సీజన్‌లో మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి జలాశయాలు నిండి దిగువకు అక్టోబరులోనూ వరద వస్తోంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో సాగర్ నిండుకుండలా మారింది. సాగర్‌ దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో..14 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.5 అడుగులకు చేరింది. ఇంకా సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీంఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.5 టీఎంసీలకు చేరింది. 2 లక్షల 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అదేస్థాయిలో ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. 
Read More : వెదర్ అప్ డేట్ : కోస్తాకు అతి భారీ వర్ష సూచన