ఆపరేషన్‌ 2.o : ఈసారైనా ధర్మాడి సత్యం సక్సెస్ అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు... మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 02:36 PM IST
ఆపరేషన్‌ 2.o : ఈసారైనా ధర్మాడి సత్యం సక్సెస్ అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు… మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు… మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో… ఆపరేషన్‌ రాయల్ వశిష్ట 2.oను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సోమవారం(అక్టోబర్ 14,2019) గోదావరిలో బోటు వెలికతీత పనులు మొదలుపెట్టబోతోంది.

కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట మరోసారి మొదలు కానుంది. కచ్చులూరు దగ్గర వరద ప్రవాహం తగ్గడంతో పాటు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో… సోమవారం నుంచి వెలికితీత పనులు ప్రారంభించాలని ధర్మాడి సత్యం బృందం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి నుంచి అనుమతి రావడంతో… ధర్మాడి సత్యం తన బృందాన్ని తీసుకుని యంత్ర సామగ్రితో కచ్చులూరు బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల క్రితం బోటు మునిగిన ప్రాంతానికి వెళ్లిన సత్యం… అక్కడ వాతావరణ పరిస్థితిని తెలుసుకుని వచ్చారు. అంతా అనుకూలంగా కనిపించడంతో ఎక్కువ రోజులు ఆలస్యం చేయకుండా… ఆపరేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఎగువనుండి వస్తున్న వరద తగ్గడంతో ధర్మాడి సత్యం… జిల్లా కలెక్టర్‌ను కలిసి గోదావరి పరిస్థితి వివరించాడు. దీంతో బోటు వెలికితీత ప్రయత్నాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోసారి సత్యం బృందం ప్రయత్నాలు చేయనుంది. కాగా బోటు వెలికితీత ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోనే బోటు ప్రమాదంలో మృతిచెందిన మరో రెండు మృతదేహాలు ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకి కొట్టుకొచ్చాయి. అయితే ఇవి బోటు ప్రమాదంలో మరణించిన వారివా కాదా అన్నది నిర్ధారించాల్సి ఉంది.

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం టీమ్‌… గతంలో విశ్వ ప్రయత్నాలు చేసింది. మూడు రోజుల పాటు రకరకాల ప్లాన్‌లతో ప్రయత్నించి విఫలమైంది. మొదటి రోజు ప్లాన్ వన్ ప్రకారం.. నీటిలోని బోటును ఇనుప రోప్‌తో గట్టిగా చుట్టారు. దాన్ని లాగే ప్రయత్నంలో రోప్ తెగిపోయింది. తొలి రోజు పనులు ముగిసే సరికి దాదాపు వెయ్యి మీటర్ల రోప్ నీటిలోనే ఉండి పోయింది. దాన్ని పూర్తిగా బయటకు తీసేందుకు రెండోరోజు విఫలయత్నం చేశారు. చివరకు ప్లాన్‌-2ని అమలు చేశారు. భారీ యాంకర్లకు.. ఇనుప రోప్‌లను కట్టి వశిష్టబోటు నీట మునిగిన ప్రాంతానికి 200మీటర్ల పరిధిలో జార విడిచారు. ఆ తర్వాత పంటును.. నీటి వాలుకు పోనిస్తూ.. యాంకర్‌ను పడవకు తగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యాంకర్‌ ఓ భారీ వస్తువుకు తగిలింది. అది కచ్చితంగా మునిగిన బోటేనని ధర్మాడి సత్యం బృందం విశ్వసించింది. పోలీసులకు ఆ సమాచారం ఇచ్చింది.

అయితే.. యాంకర్‌ తగిలింది బోటుకేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. యాంకర్‌కు తగిలింది బోటే అయితే.. దాన్ని బయటకు లాగగలమా అన్న సందేహం ధర్మాడి అండ్ టీమ్‌ సభ్యుల్లో కలిగింది. మునిగిన వశిష్ట బోటు బరువు 25 టన్నుల దాకా ఉంటుంది. అది మునిగి రెండు వారాలకు పైగా అవుతుండడంతో.. బోటు మరింత బరువెక్కుతుంది. దానికి తోడు ఇసుక కూడా పేరుకుపోవడంతో .. బోటు బరువు 40 టన్నులకు చేరే అవకాశముంది. మరి అంత బరువును ఇనుప రోప్ మోయగలదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఒక వేళ బోటు బయటకు రాకున్నా.. కదిలించగలిగితే చాలని ధర్మాడి బృందం భావించింది. బోటు కదిలితే కనీసం అందులో ఉబ్బిపోయిన మృతదేహాలైనా బయటకు వస్తాయని అనుకున్నారు. మెల్లిగా రోప్‌ను నీటిలో జారవిడుస్తూ.. పంటును ఒడ్డుకు చేర్చారు. ఇనుప రోప్‌ను జేసీబీకి కట్టి నీటిలో ఉన్న భారీ వస్తువును బయటకు లాగేందుకు ప్రయత్నించారు. జేసీబీ సాయంతో రోప్‌ను లాగుతుండగా.. యాంకర్ ఒక చోట లాక్ అయిపోయింది. రెండు గంటల పాటు యాంకర్‌ను లాగేందుకు ప్రయత్నం చేశారు. చివరకు అది విరిగిపోయింది. రెండు ప్లాన్‌లూ బెడిసికొట్టడంతో… ధర్మాడి బృందంతో పాటు మృతుల కుటుంబీకులు నిరాశలో మునిగిపోయారు.

రెండు రోజులు వరుసగా విఫలమైనప్పటికీ… ధర్మాడి బృందం పట్టు విడువలేదు. మూడోరోజు కూడా ఆపరేషన్‌ కొనసాగించింది. కానీ… మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది. రెండో రోజు యాంకర్‌ విరగడంతో… కొత్త యాంకర్‌ తీసుకొచ్చి ప్రయత్నించినప్పటికీ బోటు మాత్రం చిక్కలేదు. ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలకు వరుణుడు కూడా అడ్డుపడ్డాడు. కచ్చులూరులో భారీ వర్షం కురవడంతో… మూడోరోజు కూడా ఎలాంటి పురోగతి లేకుండానే బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రెండ్రోజుల పాటు వాతావరణం కూడా ప్రతికూలంగా మారింది. దీనికితోడు ఎగువ రాష్ట్రాల నుండి వరద నీరు భారీగా పోటెత్తడంతో ఆపరేషన్ రాయల్ వశిష్టను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారడంతో… మరోసారి వెలికితీత చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. సోమవారం నుంచి ఈ పనులు మొదలు కానున్నాయి. దీంతో ఈసారైనా బోటు బయటకు రావాలంటూ మృతుల కుటుంబీకులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.