రెవెన్యూ ఉద్యోగి రౌడీయిజం : ఎన్నిసార్లు తిప్పుకుంటారు అన్నందుకు దాడి

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 03:52 AM IST
రెవెన్యూ ఉద్యోగి రౌడీయిజం : ఎన్నిసార్లు తిప్పుకుంటారు అన్నందుకు దాడి

ఓ రెవెన్యూ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఎన్నిసార్లు తిప్పుకుంటారు అని అన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ దరఖాస్తుదారుడిపై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. రెవెన్యూ ఉద్యోగి తీరుతో అంతా విస్తుపోయారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బాబూరావు అనే వ్యక్తి కుల ధృవీకరణ పత్రం కోసం కొన్ని రోజులుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అయినా పని కావడం లేదు. బుధవారం(నవంబర్ 27,2019) ఆఫీస్ కి వచ్చిన బాబూరావు.. క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి సిబ్బందిని గట్టిగా ప్రశ్నించాడు. ఎందుకు ఆలస్యమవుతోందని కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న పవన్ ని నిలదీశాడు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. చిన్నగా మొదలైన మాటల యుద్ధం వాగ్వాదానికి దారితీసింది. ఒకరినొకరు దూషించుకున్నారు. లంచం ఇవ్వకపోతే పనులు చేయరా అంటూ బాబూరావు నిలదీశాడు. అంతే.. పవన్ కి పిచ్చ కోపం వచ్చింది. ఆవేశంగా గది నుంచి బయటకు వచ్చి బాబూరావుపై విరుచుకుపడ్డాడు. అంతా చూస్తుండగానే బాబురావుని విచాక్షణారహితంగా కొట్టాడు. అతడి గొంతు పట్టుకున్నాడు. పక్కనే ఉన్నవారు వారిస్తున్నా పవన్ దాడికి దిగాడు. ఈ దాడిలో బాబూరావుకి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

బాధితుడు బాబూరావుది ముసునూరు గ్రామం. కొన్ని రోజుల క్రితం కులధృవీకరణ పత్రం కోసం అప్లయ్ చేసుకున్నాడు. ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సర్టిఫికెట్ ఇవ్వడం లేదని వాపోయాడు. చిన్న పని కోసం ఇన్ని రోజులు తిప్పుకోవడం కరెక్ట్ కాదన్నాడు. తనపై దాడి చేసిన రెవెన్యూ ఉద్యోగిపై బాబూరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు బాబూరావు తనను దూషించాడని పవన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

కాగా, దరఖాస్తుదారుడిపై రెవెన్యూ ఉద్యోగి దాడి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కుల ధ్రువీకరణ పత్రం సకాలంలో ఇవ్వకపోగా దరఖాస్తుదారుడిపై దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్ తీరుని పలువురు ఖండిస్తున్నారు. అతడి వైఖరిని తప్పుపట్టారు. ఆ మాత్రం సహనం కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే పనులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఇదే పరిస్థితి ఉందని, దరఖాస్తుదారులను కాళ్లు అరిగేలా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. దరఖాస్తుదారుడిపై దాడి చేసిన రెవెన్యూ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.