కీలక నిర్ణయం : సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 07:41 AM IST
కీలక నిర్ణయం : సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం

అవును నిజమే. సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులు ఆదేశించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు దొరకలేదు. ఇంకా ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో సున్నా మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీల్లో ఎస్సీ, ఎస్టీలతో భర్తీ చేయాలని కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు.

కలెక్టర్ ఆఫీస్ లోని తన ఛాంబర్ లో బుధవారం(అక్టోబర్ 16,2019) రాత్రి సచివాలయాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తాను ఇది వరకే ఇతర ఉద్యోగంలో పనిచేస్తున్నానని దరఖాస్తు చేసుకునే సమయంలోనే సూచించి ఉంటేనే వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తగినంత మంది లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీకాలేదు. కొన్ని శాఖలకు సంబంధించి కటాఫ్‌ మార్కులను కూడా సాధించలేదు. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కటాఫ్‌ మార్కులు తగ్గిస్తారని అంతా భావించారు. ఆయా వర్గాలకు కటాఫ్‌ మార్కులను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కటాఫ్‌ మార్కులతో పని లేకుండా పరీక్షలు రాసిన వారిలో ఎక్కువ మార్కులు సాధించిన వారిని ఉద్యోగాల్లో నియమించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పుడు సున్నా మార్కులు వచ్చినా పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడం విశేషం. ఈ క్రమంలో అన్ని ఖాళీలను త్వరలో భర్తీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. గ్రామాల్లో ప్రతి 2 వేల జనాభాకు, పట్టణాల్లో 4 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి స్థానికంగా పాలనను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ లో రాత పరీక్షలు నిర్వహించారు. 1.30 లక్షల ఉద్యోగాలకు 20 లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్షల్లో పాస్ అయిన వారి జాబితాను ప్రకటించి మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలన, నియామకాలు జరిపారు. వివిధ కారణాలతో పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ కాలేదు. దీంతో మిగిలిన పోస్టుల్లో అర్హుల నియామకానికి రంగం సిద్ధం చేస్తున్నారు.