సంక్రాంతి సంబరాలు : విశాఖలో ప్రత్యేక వేడుకలు

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 06:15 AM IST
సంక్రాంతి సంబరాలు : విశాఖలో ప్రత్యేక వేడుకలు

విశాఖలో తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టి పడేలా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా ఆటాపాటలతో ఆకట్టుకున్నారు. ఓవైపు ప్రభుత్వం, మరో వైపు విద్యాసంస్థల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో సంక్రాంతికి రెండు రోజుల ముందే పండగ శోభ నెలకొంది.

తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగాయి సంక్రాంతి సంబరాలు. విశాఖ వుడా చిల్డ్రన్ ఎరీనాలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించిన సంక్రాంతి వేడుకల్లో డూడూ బసవన్న, థింసా, తప్పెట గుళ్ళు, భోగి మంట పాటలు, యువత నృత్యాలు ఆద్యంతం అలరించాయి.. విద్యార్థుల‌కు చ‌దువుతో పాటు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా.. స్కూళ్లల్లో కూడా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు.

ఈ వేడుకల్లో పంచెకట్టులో పాల్గొన్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆకట్టుకున్నారు. భోగి మంటను అంటించి, థింసా డ్యాన్స్ చేస్తూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల్లో కొత్త ఊత్సాహాన్ని నింపారు.  సంక్రాంతి అంటేనే ఓ గెట్ టు గెదర్‌లా ఉంటుందన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పేందుకే  ప్రభుత్వం తరపున ఈ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యంగా చిన్నారులు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  సంక్రాంతి పాటలకు డ్యాన్సులు చేసి  అబ్బుర పరిచారు.  హరిదాసు వేష ధారణలు, చిన్నారుల నృత్యాలు, రంగవల్లులతో పాఠశాల్లో పండగ సందడి సంతరించుకుంది. తరించిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు తెలియాలంటే ప్రతి పాఠశాలలోనూ ఈ వేడుకలు జరపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.