లింగంపల్లి-కాకినాడ మధ్య సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 06:45 AM IST
లింగంపల్లి-కాకినాడ మధ్య సంక్రాంతికి  ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంత ఊళ్లకు పయనమవుతూ ఉంటారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  కాకినాడ లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ రైలు కాజీపేట,విజయావాడ మీదుగా గమ్యస్దానాన్ని చేరుకుంటాయి. 

విజయవాడ డివిజన్‌ పరిధిలో కాకినాడ టౌన్‌ నుంచి విజయవాడ మీదుగా లింగంపల్లి వరకు మొత్తం 26 సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడవనున్నాయి. ఈ 26 సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జనవరి 1, 3, 6 , 8, 10, 13, 15, 20, 22, 24 , 27, 29 , 31 తేదీల్లో నడుస్తాయి. ట్రైన్‌ నెంబర్‌ 02775 పేరుతో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌ నుంచి బయలుదేరి లింగంపల్లికి ఉదయం 7.30కు చేరుతుంది. 

మరుసటి తేదీల్లో లింగంపల్లి నుంచి ఇదే రైలు ట్రైన్‌ నెంబర్‌ 02776 పేరుతో 
జనవరి 2, 4, 7, 9, 14, 16, 18, 21, 23, 25, 28, 30, ఫిబ్రవరి 1న తిరుగు ప్రయాణమవుతాయి. ఈ రైలు లింగంపల్లిలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి కాకినాడకు మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు చేరుతుంది. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ 2 టైర్‌, ఏసీ త్రీ టైర్‌ కోచ్‌లు ఉంటాయి.
 
హబీబ్‌గంజ్‌ – చెన్నై సెంట్రల్‌ మధ్య ప్రత్యేక రైలు
నూతన సంవత్సరం దృష్ట్యా విజయవాడ మీదుగా హబీబ్‌గంజ్‌ – చెన్నై సెంట్రల్‌ మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు డిసెంబరు 31 వ తేదీన ఉదయం 10.25 గంటలకు హబీబ్‌గంజ్‌ నుంచి బయలు దేరుతుంది. మరుసటి రోజున ఉదయం 10.10 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు ఇటర్సీ, ఆమ్లా, నాగ్‌పూర్‌, సేవాగ్రామ్‌, చంద్రపూర్‌, బలార్ష, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, రామగుండం, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేట స్టేషన్లలో ఆగుతుంది