జగన్ ప్రభుత్వం ఆ జీవో వెనక్కి తీసుకోవాల్సిందే: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశం

  • Published By: vamsi ,Published On : December 19, 2019 / 06:07 AM IST
జగన్ ప్రభుత్వం ఆ జీవో వెనక్కి తీసుకోవాల్సిందే: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 2430 మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. ఈ జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేయగా.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది.

జీవో 2430పై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ జరిపింది. జీవో వల్ల ఏ పత్రిక అయినా వార్త రాస్తే ఆధారాలున్నాయా? లేవా అనేది చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందని ప్రెస్‌కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవో జర్నలిస్టుల విధి నిర్వహణకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది.

పాత్రికేయుల్ని భయపెట్టేలా ఉన్న ఈ జీవోపై ప్రభుత్వం తరుపున వాదనను.. ఐ అండ్ పీఆర్ అదనపు డైరెక్టర్‌ కిరణ్‌ వినిపించారు. జీవోను దుర్వినియోగం చేయబోమని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ వాదనతో ప్రెస్ కౌన్సిల్ సంతృప్తి చెందలేదు. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని జస్టిస్‌ ప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

తెలుగు మీడియాలో కొన్ని చానళ్లు, పత్రికలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన జగన్.. వాటిని కట్టడి చేయడానికి ఈ జీవో తెచ్చినట్లు ప్రెస్ కౌన్సిల్ భావించింది. ఈ క్రమంలో కేబినేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొందింది. అయితే ప్రెస్‌కౌన్సిల్ ఆ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశించగా విశేషాధికారాలు ఉన్న ప్రెస్‌కౌన్సిల్‌ జగన్ ఒకవేళ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియవలసి ఉంది.