విశాఖ భూ కుంభకోణం : సీఎం జగన్ కీలక నిర్ణయం 

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 12:51 AM IST
విశాఖ భూ కుంభకోణం : సీఎం జగన్ కీలక నిర్ణయం 

రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో నిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్‌కుమార్ నేతృత్వంలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తూ 2019, అక్టోబర్ 17వ తేదీ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. కుంభకోణంపై పూర్తి విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని అదేశించింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూ కుంభకోణం వెనకున్న వారి ఆటలు కట్టిస్తామని, అక్రమాలు బయటపెడతామని హెచ్చరించింది. స్కామ్‌ వెనక పెద్ద తలకాయలున్నాయని సాక్షాత్తు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అప్పట్లో చెప్పడంతో మరింత వేడెక్కింది. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు, అనేక మంది ఎమ్మెల్యేల హస్తం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంది. సీబీఐ విచారణ జరపాలని విపక్షాలు కోరినా బాబు సర్కార్ పట్టించుకోలేదు. సిట్ నివేదిక సైతం బయటపెట్టకుండా క్లీన్‌చిట్ ఇచ్చేసింది. 

విశాఖలో విలువైన భూములు అప్పట్లో కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. పెందుర్తి నుంచి భీమునిపట్నం వరకూ ఉన్న పేదల భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయని అప్పటి ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. కబ్జాకు గురైన భూముల విలువ వేల కోట్లలో ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో టీడీపీలో ఉన్న పెద్దలంతా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి..  నూతన సిట్  ఈ కేసును రీ ఓపెన్ చేస్తే వారంతా నిజంగా బయటకు వస్తారా?, ప్రభుత్వ భూములకు న్యాయం జరుగుతుందా?, పేదలకు ఆ భూములు దక్కుతాయా? నిజంగా ఇందులో దోషులకు శిక్ష పడుతుందా? అన్నది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 
Read More : రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు