అమరావతిలో భూ యాజమానుల వివరాలు సేకరిస్తున్న సిట్.. అజ్ఞాతంలోకి నేతలు

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 11:54 PM IST
అమరావతిలో భూ యాజమానుల వివరాలు సేకరిస్తున్న సిట్.. అజ్ఞాతంలోకి నేతలు

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పుడు తమ తలుపు తడతారోనని నేతలు హడలిపోతున్నారు. కొందరు పనులు చక్కబెట్టుకునే కార్యక్రమంలో ఉంటే ఇంకొందరు పత్తాలేకుండా పోతున్నారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దూకుడు పెంచిన సిట్‌:
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ స్పీడప్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అవినీతి, అక్రమాల ఆరోపణలతో పాటు తమకందిన నివేదికలో ఉన్న వివరాల ఆధారంగా అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది. రాజధాని ప్రకటనకు ముందు అమరావతిలో భూములు ఎవరెవరు.. ఎప్పుడు కొన్నారు.. ఎవరి పేరు మీద కొనుగోలు చేశారనే అంశాలపై కూపీ లాగుతోంది. ఇందులోభాగంగా ఒక్కొక్కర్ని సెలెక్ట్‌ చేసుకుని వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో తనిఖీలు చేసేలా అధికారులు ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా అక్రమాల నిగ్గు తేల్చాలని భావిస్తోంది సిట్ బృందం. అదే సమయంలో బినామీలపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. 

మాజీ మంత్రి వియ్యంకుడి ఇంట్లో రహస్య విచారణ:
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేత వియ్యంకుడి ఇంట్లో సిట్‌ అధికారులు రహస్యంగా సోదాలు చేశారు. విజయవాడలోని పటమటలంక, రామవరప్పాడులోని ఆయన ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారు. విచారణలో అసైన్డ్‌ భూముల కోనుగోళ్లకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అలాగే విలువైన భూముల పత్రాలతో పాటు కంప్యూటర్ హర్డ్‌ డిస్క్, బ్యాంకు లాకర్స్‌లోని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సీట్ అధికారులు ఎప్పుడు తమ ఇంటికి వస్తారోనని నేతలు, అధికారుల హడలిపోతున్నారు.  స్పాట్..

నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి నోటీసులు:
మరోవైపు కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలుపై అనేక అక్రమాలకు పాల్పడారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు టీడీపీ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఉన్నారు. సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ ఇంట్లోకి పోలీసులెవర్నీ అనుమతించ లేదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాలపై ఓ వైపు సీఐడీ మరోవైపు సిట్‌ అధికారులు విచారణ వేగవంతం చేయడంతో అమరావతిలో భూములు కొన్న నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.