స్మార్ట్‌ దిశగా ఏయూ వర్సిటీ : ప్లాస్టిక్‌ సర్టిఫికెట్స్‌

  • Published By: madhu ,Published On : February 24, 2019 / 12:38 PM IST
స్మార్ట్‌ దిశగా ఏయూ వర్సిటీ : ప్లాస్టిక్‌ సర్టిఫికెట్స్‌

చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్మార్ట్‌ దిశగా అడుగులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఫీజు చెల్లింపుల నుంచి డీడీ వరకు అంతా ఆన్‌లైన్ చేసింది. తాజాగా సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంది. నకిలీల నివారణకు అరుదైన ఫీచర్స్‌తో ప్లాస్టిక్‌ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్టిఫికెట్‌ నకిలీ చేసేందుకు అవకాశం లేని విధంగా చర్యలు తీసుకొంటోంది. దేశంలోనే మెుట్టమెుదటిసారిగా క్యూఆర్‌కోడ్ కలిగిన వీటిని అందజేయనుంది. 

విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఎంతో కీలకం. ప్రఖ్యాత వర్సిటీల సర్టిఫికేట్స్‌కు ఎంతో కీలకం. అయితే కొన్ని వర్సిటీలకు చెందిన సర్టిఫికెట్స్ విషయాల్లో నకిలీలు బయటపడుతున్నాయి. ఇందులో విద్యార్థి ఫొటో కూడా ఉండడం లేదు. దీనివల్ల యూనివర్శిటీ అందించే సర్టిఫికెట్‌కు నకిలీ సృష్టి ఈజీగా జరిగిపోతోంది. నీటిలో తడిసినా పాడైపోతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఏయూ నడుం బిగించింది. స్మార్ట్‌ ప్లాస్టిక్‌ సర్టిఫికెట్లను అందించేందుకు అత్యాధునిక స్మార్ట్‌ సర్టిఫికెట్‌ ప్రింటింగ్‌ మెషిన్‌ను సమకూర్చుకున్నారు. 

జపాన్‌కు చెందిన సంస్థ ఈ పేపర్‌ను సరఫరా చేస్తుంది. ఒకవేళ నకిలీ చేయాలని ప్రయత్నించినా సులభంగా గుర్తించేందుకు అవకాశముంటుంది. సీరియల్‌ నంబర్‌, హై రెజల్యూషన్‌ బోర్డర్‌, మిర్రర్‌ టెంట్‌, ఇన్విజుబుల్‌ లోగో, యాంటీ కాపీ, ఘోస్ట్‌ ఇమేజ్‌, క్యూఆర్‌కోడ్‌, బ్లైండ్‌ ఎంబోస్‌, స్పెల్లింగ్‌ మిస్టేక్‌ వంటి పలు రకాలైన ఫీచర్‌లు ఈ సర్టిఫికెట్‌లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల నకిలీలు రావడం అసాధ్యమని అధికారులు పేర్కొంటున్నారు. ఏయూ జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్‌ కోడ్ ఇవ్వనున్నారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినట్టైతే విద్యార్థికి సంబంధించిన సమాచారం మొత్తం యాప్‌లో వచ్చేస్తుంది. సర్టిఫికెట్లు ప్లాస్టిక్‌తో తయారు చేయడం వల్ల నీటిలో తడిసినా ఇబ్బంది ఉండదు. ప్రత్యేకంగా ల్యామినేషన్‌ చేయించాల్సిన అవసరం ఉండదు. 

కాగితపు సర్టిఫికెట్ల తయారీని ఒక ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. తత్కాల్ సర్టిఫికెట్స్‌ను 48 గంటల్లో.. నార్మల్‌గా అప్లై చేసిన సర్టిఫికెట్స్‌ను ఇకపై 5 రోజుల్లోనే అందించనున్నారు. ప్రస్తుతం యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టాలు పొందుతున్న విద్యార్థులకు అందించే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, మెమోలు పొందాలంటే నెలల తరబడి ఆగాల్సి వచ్చేది. ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులకు అందించే సరికొత్త విధానానికి ఏయూ వర్శిటీ అధికారులు శ్రీకారం చుట్టారు.