తల్లిని కాపాడుకోలేకపోయిన కొడుకు : మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు

బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు చేశాడో కొడుకు.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 03:39 PM IST
తల్లిని కాపాడుకోలేకపోయిన కొడుకు : మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు

బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు చేశాడో కొడుకు.

మానవత్వం మంటగలిసింది.. కన్న తల్లిని కాపాడుకోవాలనుకున్న కొడుకు ఆరాటం వృధా అయ్యింది. మృత్యువు తరుముతున్న తల్లిని ఇంట్లో ఉంచవద్దంటూ బయటకు పంపాడు యజమాని. చిన్నప్పటి నుంచి తనను కళ్లల్లో పెట్టుకుని పెంచిన అమ్మ… ఎన్నో కష్టాలకోర్చి తనను పెద్ద చేసిన అమ్మ… క్యాన్సర్‌ బారిన పడేసరికి ఆ కుమారుడి హృదయం తల్లడిల్లింది. ఎలాగైనా సరే… ఆమెను కాపాడుకోవాలని తపించాడు. రెండు రోజులుగా చేతులపై మోసుకుంటూ అక్కడికీ ఇక్కడికీ తిరిగారు. సాటి మనిషి కష్టాల్ని చూసి చలించని మనుషులకంటే తానే నయమంటూ చివరకు ఆ తల్లిని మృత్యు దేవత తీసుకెళ్లింది. బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.

వెంకటయ్య, వెంకటలక్ష్మి దంపతులది ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం. మూడేళ్లుగా పామూరు పట్టణంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల కిందట వెంకటలక్ష్మికి క్యాన్సర్‌ సోకింది. మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు సతీష్‌ ఆమెను పలు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్సల కోసం సతీష్‌ 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. వెంకటలక్ష్మి ఆరోగ్యం క్షీణించగా (నవంబర్ 18, 2019) పామూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రిమ్స్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. 

తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా.. ఇంటి యజమాని తీసుకురావొద్దని హెచ్చరించారు. చేసేది లేక సతీష్‌ తన తల్లిని తిరిగి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెను అక్కడ ఉంచడం కుదరదని ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. పంచాయతీ అధికారులు ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం’లో ఇచ్చిన గదిలో ఆ రోజు రాత్రికి తలదాచుకోవాల్సి వచ్చింది. 19వ తేదీ ఉదయం సిబ్బంది వచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారు. 

దిక్కుతోచని స్థితిలో సతీష్‌ తన తల్లిని చేతులతో మోసుకుంటూ స్థానిక డీవీ పార్కుకు వెళ్లారు. అక్కడ టెంట్‌ వేసుకుని రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వృద్ధురాలిని పామూరు వైద్యశాలలో చేర్చుకోవాలని వైద్యాధికారికి సూచించారు. సిబ్బంది ఆమెను చేర్చుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటలక్ష్మి మృతి చెందింది. 

బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. అంత బాధలో ఉంటే… స్నేహితులు, బంధువులు సహా ఎవరూ సాయం చేయలేదని, తన గోడు పట్టించుకున్న వారు ఎవరూ లేదని… ఈ దుస్థితి వేరెవరికీ రాకూడదంటూ సతీష్‌ బోరుమన్నారు.