సాక్షాత్తు ఆదిశేషుడే దిగివచ్చే ‘నాగోబా’ గిరిజన జాతర

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 09:49 AM IST
సాక్షాత్తు ఆదిశేషుడే దిగివచ్చే ‘నాగోబా’ గిరిజన జాతర

ఆదిలాబాద్ లోని ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగగా ‘‘నాగోబా’’ జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతర ‘‘నాగోబా’’ జాతర. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర శుక్రవారం (24.01.2020)   పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభంకానుంది.  తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. 

ఆదివాసీల సంప్రదాయాలకు పెద్దపీట వేసే నాగోబా జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. దేశం నలుమూలల నుంచి గిరిజనులు ఈ జాతరకు రావడం ఆనవాయితీ. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర.. మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైయ్యే ఈ వేడుకను చూడటానికి ఎంతోమంది తరలివస్తారు. మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన తర్వాత జాతర ప్రారంభమైనట్లు లెక్క. 

మహాపూజ జరిగిన తర్వాతే ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేయాలి. అంతవరకు ఆలయంలోపలికి ఎవ్వరూ రాకూడదు. మహాపూజ అనంతరం మెస్రం వంశీయులు భేటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. మెస్రం వంశంలోకి వచ్చిన కొత్త కోడళ్లకు నాగోబా దర్శనం చేయించి.. వంశ పెద్దలను పరిచయం చేయిస్తారు. అనంతరం వారిచే ఆశీర్వాదాలు ఇప్పిస్తారు.

అలా ఈ భేటింగ్ కార్యక్రమంతో..కొత్త కోడళ్లు మెస్రం వంశంలోకి వచ్చినట్లు భావిస్తారు. ఈ పండుగకు నాగలోకం నుంచి సాక్షాత్తు ఆదిశేషుడే దిగి వస్తాడని ఆదివాసీలు నమ్ముతారు. ఆదిలాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగోబా ఆలయం. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ సమీపంలోని కేస్లాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. అమావాస్య నాడు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనేది నమ్ముతాడు. 

ఆదివాసీయులు పూజలు చేసి పాలను ఆదిశేషుడికి నైవేద్యంగా పెడతారు. ఆ పాలను ఆదిశేషుడు తాగి తమను ఆశీర్వదిస్తాడని బలంగా నమ్ముతారు ఆదివాసీయులు. నాగోబా జాతరతో కేస్లాపూర్ గ్రామం జనసంద్రంగా మారుతుంది. వాస్తవానికి 5 వందల లోపు మాత్రమే జనాభా ఉండే గ్రామంలో నాగోబా జాతరతో సందడి సందడిగా మారుతుంది. పెద్దసంఖ్యలో తరలివచ్చే ఆదీవాసీలతో కేస్లాపూర్ సరికొత్త శోభ సంతరించుకుంటుంది. నాగోబాను కొలిస్తే కొంగుబంగారంగా నిలుస్తాడని, పంటలు బాగా పండుతాయని, రోగాలు తమ దరిదాపులకు కూడా రావని  నమ్ముతారు ఆదివాసీయులు.