వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?

పోరాటాల గడ్డ.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రం.. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక. అదే వరంగల్.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 01:18 PM IST
వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?

పోరాటాల గడ్డ.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రం.. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక. అదే వరంగల్.

పోరాటాల గడ్డ.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రం.. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక. అదే వరంగల్. హస్తం పార్టీ హవా చెలాయించినా.. ప్రస్తుతం గులాబీ తోటకు పెట్టని కోటగా ఉంది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొస్తుందా.. కారు టాప్ గేర్‌‍లో దూసుకుపోతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి పెట్టని కోటగా ఉంది. 2009లో ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఓసారి కాంగ్రెస్, రెండుసార్లు టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించాయి. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ మరోసారి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి దొమ్మాటి సాంబయ్య పోటీలో ఉన్నారు.
Read Also : ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి

బీజేపీ కూడా అభ్యర్థిని పోటీకి పెట్టినా.. కనీసం ప్రచారం కూడా చేయకపోవడంతో.. ఈసారి కూడా కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ ఉంది.రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గెలుపు ధీమాతో కనిపిస్తోంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలుండటంతో… మెజారిటీపైనే ఆ పార్టీ దృష్టి పెడుతోంది. సంస్థాగతంగా బలం ఉండటం.. ఇతర పార్టీల నుంచి వలసలతో కారు పార్టీ జోరుమీదుంది.

వరుస పరాజయాల నుంచి కోలుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కటే కాంగ్రెస్ ఖాతాలో ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య గెలుపు బాధ్యతను తీసుకున్నారు. గండ్ర మినహా.. అగ్రనేతలెవరూ ప్రచారంలో పాల్గొనకపోవడం హస్తం పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది. వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కేడర్‌ను సమన్వయ పరిచే నేతలు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

వరంగల్‌లో బీజేపీకి గతంలో కాస్త పట్టుండేది. కానీ.. ఆ పార్టీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. చింతా సాంబమూర్తిని అభ్యర్థిగా ప్రకటించినా… పెద్ద నేతలెవరూ ఆయన తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదు. అటు కేడర్‌ కూడా ప్రచారంపై ఆసక్తి చూపించకపోవడంతో.. నామమాత్రపు పోటీ అన్నట్లుగా బీజేపీ పరిస్థితి మారింది.

ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. వర్ధన్నపేటలో టీఆర్ఎస్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పాలకుర్తిలో కూడా కారు పార్టీకి మంచిపట్టుంది. పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత 2 లోక్‌సభ ఎన్నికల్లోనూ పరకాలలో టీఆర్ఎస్‌కు పెద్ద  ఎత్తున ఆదరణ లభించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ… ఓటమి తర్వాత నియోజకవర్గం పరిధిలో అస్సలు కనిపించలేదు.

అటు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. 2012 నుంచి నాయకత్వ లోపం ప్రధాన సమస్యగా ఉంది. వరంగల్‌ తూర్పు నియోజకర్గంలోనూ ఇదే పరిస్థితి. ద్వితీయశ్రేణి నేతలు టీఆర్ఎస్‌లో చేరడంతో.. హస్తం పార్టీ పూర్తిగా డీలా పడింది. మొత్తంగా.. ఏ అసెంబ్లీ నియోజకవర్గం చూసినా.. టీఆర్ఎస్‌దే హవా కనిపిస్తోంది. దీంతో… పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తమదే అనే ధీమా గులాబీ నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తేవాలని భావిస్తున్న కాంగ్రెస్… ఇక్కడ గెల్చి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Read Also : మోడీ పచ్చి అబద్దాలకోరు: కేంద్రంలో చక్రం తిప్పేది మేమే