ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 02:59 PM IST
ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం

ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం అదే స్థాయిలో చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుండి క్షేత్ర స్థాయి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ రకాల యాప్‌లు, విస్తృత స్థాయి నెట్ వర్క్‌తో క్షేత్ర స్థాయి పరిశీలన, పటిష్ట నిఘా, లేటెస్ట్ టెక్నాలజీ ఇలా అన్ని రకాల చర్యలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. మరోవైపు శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలలో ఓటర్లు ఓటు  విలువ తెలుసుకొని వినియోగించుకునేలా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. 

ఏప్రిల్ 11 న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేసింది. జిల్లాలో పది నియోజకవర్గాల్లో మొత్తం 21లక్షల75వేల 176 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కన్నా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుండి పల్లె స్థాయి వరకు ఈవీఎం, వీవీప్యాట్లపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించామని అధికారులు తెలిపారు. 

ఈ పోలింగ్‌కి సంబంధించి 19వేల206 మంది ఎన్నికల సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు. 15 వేల మంది పోలీసులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా కఠినమైన ఆంక్షలను విధించినట్లు  పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఇటు చెక్ పోస్టులు, వీడియో సర్వేలెన్సుపై నిఘా కఠినం చేయడమే కాకుండా మీడియా పాస్‌లపై కూడా పరిమితులు విధించారు. 

జిల్లాలో 2 వేల910 పోలింగ్ కేంద్రాలు ఉండగా…  వీటిలో సుమారు 6వేల41 వరకు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి వద్ద గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని చేస్తున్న  శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున చేస్తోన్న ప్రచారాలు మంచి ఫలితమిస్తోందని  విద్యావేత్తలు భావిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లపై పూర్తి స్థాయి దృష్టి సారించి అధికారులు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు.  ప్రధాన కూడళ్ళ వద్ద హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు ..ప్రచార రథాలు సైతం పెద్ద ఎత్తున తిరిగేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.