కరోనా కేటుగాడు..ప్లాస్మా దానం చేస్తానని 200 మందికి టోకరా వేసిన యువకుడు

  • Published By: nagamani ,Published On : July 21, 2020 / 12:23 PM IST
కరోనా కేటుగాడు..ప్లాస్మా దానం చేస్తానని 200 మందికి టోకరా వేసిన యువకుడు

ప్లాస్మా దానం చేస్తానంటూ ఏపీలో ఓ కేటుగాడు ఏకంగా 200 మందిని మోసం చేశాడు. 200ల మంది దగ్గర డబ్బులు గుంజి పత్తా లేకుండా పోయిన కరోనా కేటుగాడికి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనుగూటివలసకు చెందిన రెడ్డి సందీప్ అనే 25 నవ యువకుడు కరోనా పేరుతో దందాలు మొదలుపెట్టాడు. ఉద్యోగం దొరకక ఈ కరోనా పేరుతో మోసాలకు దిగాడు. 2016లో డిగ్రీ పూర్తి చేసి సందీప్ ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. విశాఖపట్టణంలోని ద్వారక, టూ టౌన్ పీఎస్ పరిధిలో చోరీలు చేస్తు దొరికిపోయి జైలుకు వెళ్లాడు ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. అయినా బుద్ది మారలేదు. ఈసారి కరోనా పేరుతో మోసాలకు దిగాడు.

జైలు నుంచి బయటకు వచ్చాక కరోనా బాధితులకు ప్లాస్మా దానానికి డిమాండ్ ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. అహా..భలే ఛాన్సులే అనుకుంటూ రంగంలోకి దిగిపోయాడు. ప్లాస్మా డోనర్ పేరుతో మోసాలకు తెరలేపాడు. సోషల్ మీడియాలో ప్లాస్మా దాతల కోసం ఇచ్చిన ప్రకటనలు చూసి వారికి ఫోన్ చేసేవాడు. తాను కరోనా నుంచి కోలుకున్నానని..తన బ్లడ్ గ్రూప్ కూడా మీకు కావాల్సిందేనంటూ వారికి ఫోన్ చేసి నమ్మించేవాడు. అలా కొంతమంది అతని వలలో చిక్కుకున్నాక వారి నుంచి డబ్బులు రాబట్టేందుకు తాను శ్రీకాకుళం నుంచి వచ్చేందుకు రవాణా, ఇతర ఖర్చుల కోసం కొంత డబ్బు కావాలని వాటిని బ్యాంకు ఎకౌంటులో డబ్బులు వేయించుకునేవాడు.

అతడి చేతిలో మోసపోయిన హైదరాబాద్‌కు చెందిన బాధితులు పంజాగుట్ట, రాంగోపాల్‌పేట, బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్లతోపాటు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం (జులై 20,2020)ర రెడ్డి సందీప్ ను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ప్లాస్మా దానం పేరుతో రెడ్డి సందీప్ 200లమందిని మోసం చేశాడని పోలీసులు విచారణలో తేలింది.