రాజాం రాజెవరు : నువ్వా..నేనా

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 01:33 PM IST
రాజాం రాజెవరు :  నువ్వా..నేనా

శ్రీకాకుళం : ఆ పార్టీలో ముఖ్యనేతలున్నారు.. మూడు గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇదీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విబేధాలు కారణంగా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. ఈ సారి రాజాం స్ధానంపై టీడీపీ కన్నేస్తే.. ఎలాగైనా పట్టునిలుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్‌,  జనసేన, బీజేపీ ఇంకా అభ్యర్ధుల విషయంలో స్తబ్ధత కొనసాగిస్తూనే ఉన్నాయి. అసలు రాజాం స్ధానం ఎవరివశమయ్యే ఛాన్స్‌ ఉంది. ? 
శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు కన్ఫ్యూజన్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి మాజీ స్పీకర్ ప్రతిభా భారతిపై వైసీపీ అభ్యర్ది కంబాల జోగులు కేవలం 512 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వాస్తవానికి ప్రతిభా భారతి బలమైన ఓటు బ్యాంకు ఉన్న అభ్యర్ధి. అయినప్పటికీ ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు సొంత నియోజకవర్గం కావడంతో .. కళా వర్సెస్ కావలి గ్రూపు తగాదాలు ఫ్యాన్ గాలి వీచేందుకు కారణమయ్యాయి. మరో టీడీపీ నేత కొల్లి అప్పల నాయుడుది వేరే వర్గం. ఇలా మూడు గ్రూపులున్న టీడీపీలో .. ఈ ముగ్గురినీ కాదని ఈసారి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ను.. చంద్రబాబు, లోకేష్‌లు నేరుగా పార్టీలోకి ఆహ్వానించి, నియోజకవర్గ టీడీపీ భాద్యతలు కట్టబెట్టారు. కొండ్రు రాకతో అన్ని గ్రూపులు డైలమాలో పడ్డాయి. 
512 ఓట్ల మెజారిటీతో గెలుపు
బలమైన ఓటు బ్యాంకున్న అభ్యర్ధి
కళా వర్సెస్ కావలి గ్రూపు తగాదాలు 
కొల్లి అప్పల నాయుడుది వేరే వర్గం
కొండ్రు మురళీ మోహన్‌కు బాధ్యతలు

పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందంగా మారింది ఇప్పుడు మూడు గ్రూపుల పరిస్ధితి.  ప్రాధాన్యత ఎవరికీ కాకుండా పోయింది. పైగా కొండ్రు రాకతో అందరూ కలిసి పనిచేయాలని అధిస్టానం ఆదేశాలు ఇవ్వడంతో..  ఇక చేసేదేమీ కూడా లేదు. అటు తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న కొండ్రు మూడు గ్రూపులను కలుపుకుంటూ చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కొండ్రు ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు.. ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జోగులు దూకుడు పెంచలేకపోయారు. కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇటు జిల్లా రాజకీయాలు, అటూ అసెంబ్లీ నియోజకవర్గంలో జోగులు తనదైన హవా చూపలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొండ్రు ఈ స్థానం నుంచి పోటీ 
ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ 
ఎమ్మెల్యేగా ఉన్నా దూకుడు పెంచలేని జోగులు
నియోజకవర్గానికే పరిమితమయ్యారు

ఇదే తరుణంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అస్వస్థకు గురవడం, కొండ్రు మురళి గెలుపుకు కళా కృషి చేస్తానని హామీ ఇవ్వడం వంటి పరిణామాలు సైకిల్ స్పీడును మరింత పెంచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మరింత దూకుడు పెంచి నియోజకవర్గంలో రాజాం నగర పంచాయితీ, రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి మండలాల్లో మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి టీడీపీలో కొండ్రు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో కంబాల అభ్యర్ధిత్వాలు ఖరారు కాగా జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా ఆశావహుల వేటలోనే ఉన్నాయి. ఈసారి కూడా రాజాం సీటు తమ ఖాతాలోనే వేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తుంటే.. రాజాం కోటలో జెండాపాతాలని టీడీపీ భావిస్తోంది. ఇక మిగిలిన పార్టీలు కూడా అభ్యర్ధులను ఖరారు చేస్తే కానీ గెలుపోటములను అంచనావేయలేమంటున్నారు విశ్లేషకులు.