శ్రీశైలం డ్యామ్‌కు ముప్పు ?

  • Published By: madhu ,Published On : May 3, 2019 / 10:42 AM IST
శ్రీశైలం డ్యామ్‌కు ముప్పు ?

శ్రీశైలం డ్యామ్‌కు మప్పు పొంచి ఉందా.. డ్యామ్‌ నీరు జాలువారే ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ముప్పుగా మారుతోందా.. ఇప్పుడు ఇదే అంశం ఆందోళనకు గురిచేస్తోంది. 1999 వరదల కారణంగా 60 అడుగుల మేర ఏర్పడ్డ గొయ్యి.. క్రమేపీ పెరుగుతూ వస్తోంది.  2009లో వరదల కారణంగా వంద అడుగుల గొయ్యి ఏర్పడినట్లు సేఫ్టీ నిపుణుల కమిటీ తేల్చింది. భారీ వరదలు వచ్చినప్పుడు .. డ్యాం 12 గేట్లు ఒకేసారి ఎత్తిన సమయంలో .. ఈ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల శ్రీశైలం డ్యాంకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందా అనే దానిపై నిపుణులతో అధ్యయనం చేయించబోతున్నారు. 

శ్రీశైలం డ్యాంకు ముప్పుపై ఇరిగేషన్‌ అధికారులు నిపుణులతో ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నారు. డ్యాంకు ప్రమాదం ఉందా.. దాని ప్రభావం ఎంత, డ్యాం పునాదుల దాకా గొయ్యి ఉందా అనే దానిపై గోవా, విశాఖకు చెందిన నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషినోగ్రఫి అనే సంస్ధకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ సంస్ధ అధ్యయనం చేయనుంది. అధ్యయనం అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.