హంద్రీనీవాలో దూకి శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆత్మహత్యాయత్నం

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 10:22 AM IST
హంద్రీనీవాలో దూకి శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నీటి పారుదలను ఆపేయాలంటూ శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. 

దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, బాధితులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. అయితే పోలీసుల తీరుకు నిరసనగా ముగ్గురు నీటి ముంపు బాధితులు హంద్రీనీవాలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.  

మరోవైపు శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల దీక్ష కొనసాగుతోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో కర్నూలు-గుంటూరు రహదారిలోని పొట్టిశ్రీరాములు సెంటర్‌లో నీటి ముంపు నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జీవో 98 ప్రకారం తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు డిమాండు చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రెండో జాబితాలో 674 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో న్యాయం కోసం అనేక రూపాల్లో ఆందోళన చేసినా పాలకులు స్పందించలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.