గడప వద్దకే పాలన : గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం

  • Published By: madhu ,Published On : October 2, 2019 / 01:57 AM IST
గడప వద్దకే పాలన : గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం

గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచ‌న‌ కార్యరూపం దాల్చుతోంది. జగన్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 02 నుంచి ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా దాదాపు ఐదు వంద‌ల సేవ‌లను ప్రజ‌ల‌కు అందించనుంది ప్రభుత్వం. ఇందుకు కావాల్సిన ఉద్యోగ నియామకాలను ఇప్పటికే పూర్తి చేసింది జగన్ సర్కార్. ప్రజల చెంతకే సంక్షేమ ఫలాలు అందించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం..తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ స‌మీపంలోని క‌ర‌పలో ముఖ్యమంత్రి జ‌గ‌న్ గ్రామ, పట్టణ స‌చివాల‌య వ్యవస్థను ప్రారంభించ‌నున్నారు. తరువాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కన్నబాబు పరిశీలించారు.  

రాష్ట్రంలో 11,158 గ్రామ స‌చివాల‌యాలు, 3,786 ప‌ట్టణ స‌చివాల‌యాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. గ్రామ స‌చివాల‌యాల‌కు సంబంధించి ల‌క్షా, 26,728మంది గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసింది. అయితే బుధవారం నుంచి మండ‌లానికి ఒక గ్రామ స‌చివాల‌యం మాత్రమే అందుబాటులోకి రానుంది. న‌వంబ‌ర్ నాటికి గ్రామ‌, ప‌ట్టణ సచివాల‌యాల్లో స‌దుపాయాల‌న్నీ క‌ల్పించి డిసెంబ‌ర్ ఒక‌ట‌వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప‌ని చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

గ్రామ స‌చివాల‌యాల ద్వారా ప్రజ‌ల‌కు ఐదు వంద‌ల సేవ‌లను ప్రభుత్వం అందించనుంది. వివిధ పథ‌కాల ల‌బ్దిదారుల జాబితాను సచివాల‌యాల బోర్డుల‌పై పొందు పరచనుంది. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాల్లో క‌ల్పించనున్నారు. సేవలు వేగవంతం చేయనున్నారు. జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు గ్రామ వాలీంటీర్లు రంగంలోకి దిగనున్నారు. గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో జనవరి 1 నుంచి  పనిచేయడం మొదలుపెట్టాక ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాలని అధికారుల‌ను సీఎం జగన్ ఆదేశించారు. 72 గంటల్లోగా రేషన్‌కార్డు, పెన్షన్లు కల్పించాలన్నారు. వివక్ష, పక్షపాతం, లంచాలు లేకుండా ప్రజలకు గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు సేవ‌లు అందించాల‌ని స్పష్టం చేశారు. స‌చివాల‌య వ్యవ‌స్థ ల‌క్ష్య సాధ‌న‌కు గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్లకు, శాఖాధిపతులకు అనుసంధానం ఉండాల‌ని ఆదేశించారు.