దిశ కంటే ముందు నా బిడ్డను చంపేశారు : పవన్ ఒక్కరే న్యాయం చేయగలరు

తన కూతురిని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి కంటతడి పెట్టారు. తన బిడ్డ విషయంలో న్యాయం కోసం పోరాటం చేసి చేసి అలసిపోయానని అన్నారు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 11:30 AM IST
దిశ కంటే ముందు నా బిడ్డను చంపేశారు : పవన్ ఒక్కరే న్యాయం చేయగలరు

తన కూతురిని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి కంటతడి పెట్టారు. తన బిడ్డ విషయంలో న్యాయం కోసం పోరాటం చేసి చేసి అలసిపోయానని అన్నారు.

తన కూతురిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి కంటతడి పెట్టారు. తన బిడ్డ విషయంలో న్యాయం కోసం పోరాటం చేసి అలసిపోయానని అన్నారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కరే న్యాయం చేయగలరని పార్వతీదేవి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రీతిని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దిశ ఘటన కంటే ముందే నా కూతురు సుగాలి ప్రీతి ఘటన జరిగింది.. కానీ ఇంతవరకు న్యాయం జరగలేదని, నిందితులకు శిక్ష పడలేదని పార్వతీదేవి వాపోయారు. 2015 నుంచి పోరాటం చేస్తున్నా.. ఇంతవరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పార్వతీదేవి ఆరోపించారు. తన బిడ్డది ఆత్మహత్య కాదు హత్య అని.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలిందని పార్వతీదేవి చెప్పారు. ఆధారాలు ఉన్నా నిందితులను శిక్షించడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దిశ సంఘటన జరిగితే.. ఏపీలో దిశ చట్టం తెచ్చారన్న పార్వతీదేవి.. తన కూతురికి న్యాయం మాత్రం చేయలేదన్నారు.

న్యాయం కోసం పవన్ పోరాటం:
సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం(ఫిబ్రవరి 12,2020) కర్నూలు నగరంలో జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు పవన్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్వతీదేవితో పవన్ మాట్లాడారు. పార్వతీదేవి బోరున విలపించారు.

సుగాలి ప్రీతి ఎవరు? 
సుగాలి ప్రీతి ఎవరు? ఏం జరిగింది..? ఎప్పుడు జరిగింది.. ఇప్పుడెందుకు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అనే విషయాల్లోకి వెళితే.. 2017 ఆగస్టు 19న 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్యాచారాలకు బలైపోయిన బాధితుల పేర్లు బైటకు రాకూడదనే ఉద్దేశంతో బాధితురాలి పేరుని గీతగా మార్చారు. కర్నూలు శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్-పార్వతిదేవి దంపతుల 14 ఏళ్ల కుమార్తే ఈ గీత. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 10 తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న స్కూల్ లోని తరగతి గదిలో చనిపోయింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు రేప్‌ చేసి చంపేశారని ఆరోపించారు.

ప్రాథమిక రిపోర్ట్‌లో రేప్‌ చేసినట్లు నిర్ధారణ:
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు సైతం… 2017 ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక నివేదికలో బాలికని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.