ఎండల ఎఫెక్ట్ : కర్నూలులో పేలిన ఆటో గ్యాస్ సిలిండర్

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 09:41 AM IST
ఎండల ఎఫెక్ట్ : కర్నూలులో పేలిన ఆటో గ్యాస్ సిలిండర్

కర్నూలు : ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపైనా పడుతోంది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు ఆటో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఆటో 10 అడుగులు పైకి లేచి పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రషీద్ స్పాట్ లోనే చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోడా షాపులకు గ్యాస్ సిలిండర్లు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సోడా షాపులకు గ్యాస్ సిలిండర్ల లోడ్ తో ఆటో కల్లూరు నుంచి కొత్త బస్టాండ్ కి వెళ్తోంది. హఠాత్తుగా భారీ శబ్దంతో పేలింది. ఆటో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. బాంబులు ఏమైనా పేలాయా అని టెన్షన్ పడ్డారు. పెట్రోల్, డీజిల్ తో నడపాల్సిన ఆటోలను కొందరు గ్యాస్ సిలిండర్లతో నడిపిస్తున్నారని, దీని వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ల వినియోగం నిబంధనలకు విరుద్ధం.

రూల్స్ పాటించకున్నా ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఆర్టీఏ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి మరణించడానికి మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని నిబంధనలకు విరుద్దంగా గ్యాస్ సిలిండర్లతో ఆటోలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత ఆటోలో ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు.