స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్లేషన్లపై సుప్రీం స్టే

  • Published By: chvmurthy ,Published On : January 15, 2020 / 09:21 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్లేషన్లపై సుప్రీం స్టే

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే  విధించింది. 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు  ఏపీ హై కోర్టును ఆదేశించింది. 

2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేనందున తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే ప్రత్యేక పరిధిగా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ ‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా హైకోర్టు దానిపై స్పందించకుండా ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసింది. ప్రభుత్వ వాదన విన్న తరువాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. 

కాగా…స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 17న నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్ ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు రాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇచ్చిన జీవోపై స్టే విధిస్తూ… హైకోర్టులో ఉన్న పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.