జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది: టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగంటి రూప

  • Published By: vamsi ,Published On : May 4, 2019 / 07:30 AM IST
జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది: టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగంటి రూప

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మే 4వ తేదీ) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఒక్కో నియోజకవర్గం నుంచి కీలక నేతలు 50 మందితో సమీక్షలు జరపనున్నారు. పోలింగ్ సరళిపై నివేదిక ఇచ్చేందుకు పలువురు నాయకులు ఇక్కడకు వచ్చారు. పోలింగ్‌ సరళి, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షా సమావేశాలకు టీడీపీ పార్లమెంట్ అభ్యర్ధి మాగంటి రూప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనితతో పాటు ఎమ్మెల్యే అభ్యర్ధులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

గోదావరి ఉధృతిలా టీడీపీ గెలుపు:

ఈ సంధర్భంగా మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు విజయం ఖాయమని, చంద్రబాబు సునామీలో విపక్షాలు కొట్టుకుపోతారని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని, 25వేల మెజార్టీతో తన నియోజకవర్గంలో గెలవబోతున్నట్లు వెల్లడించారు. గోదావరి ఉధృతిలా టీడీపీ గెలుపు ఉండబోతోందని గోరంట్ల స్పష్టం చేశారు. కేసిఆర్ లాంటి వ్యక్తులు వేల కోట్లు జగన్ కోసం ఆంధ్రకు పంపినా వారి కుట్రలను  ఎలా ఎదుర్కొన్నామనే విషయమై సమీక్ష చేసుకుంటున్నట్లు వెల్లడించారు. 

ఏడు సీట్లు ఖాయం:

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అనుకున్నదానికంటే ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డారు రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి మాగంటి రూప. పోలింగ్ ఎలా జరిగింది అనే దానిపై సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. జనసేన ప్రభావం అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందని, అయితే జనసేన ఓటింగ్ ప్రభావం ఎవరిపై పడిందనేది తెలియవలసి ఉందని అన్నారు రూప. అంచనాలు లేవు అని, కానీ ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తామనే ధీమా మాత్రం ఉందని ఆమె అన్నారు. గతంలో ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ నమోదైందని, అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామని ఆమె అన్నారు.

మైక్రో లెవెల్ సర్వే చేస్తున్నారు:
ఎన్నికల్లో గెలుపు ఓటములపై అభిప్రాయాలను చంద్రబాబు గారు అడిగి తెలుసుకుంటున్నారని, టీడీపీ నేత అనిత అన్నారు. తన గెలుపు ఖాయమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. గెలుపులో కార్యకర్తల కష్టాన్ని గుర్తించడం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని, చంద్రబాబు మైక్రో లెవెల్ సర్వే చేస్తున్నారని వెల్లడించారు అనిత. తెలుగుదేశం కార్యకర్తలు ఇష్టం లేకపోతే కామ్‌గా ఉంటారే కానీ వ్యతిరేకంగా మాత్రం పనిచేయరని ఆమె అన్నారు. నియోజకవర్గం మారినా కూడా తన గెలుపుపై అనుమానాలు లేవని అన్నారు.