చిన్నాన్న హత్య కేసునే తేల్చలేని జగన్ ప్రజలకేం న్యాయం చేస్తారు? : బీటెక్ రవి

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 07:50 AM IST
చిన్నాన్న హత్య కేసునే తేల్చలేని జగన్ ప్రజలకేం న్యాయం చేస్తారు? : బీటెక్ రవి

సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు అప్పగించాలని కోరటం  సీఎం జగన్ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. 
ఈ క్రమంలో ఏపీ శాసన మండలి రద్దుపై కూడా బీటెక్ రవి మాట్లాడారు. టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలిని రద్దు చేస్తారని తమకు ముందే తెలుసనీ అన్నారు. 

కాగా..వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బీటెక్ రవి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు రవిని పలుమార్లు విచారణ చేశారు. రవితో పాటు మరో అనుమానితుడు కొమ్మా పరమేశ్వర్​ రెడ్డిని సైతం సిట్​ అధికారులు విచారించారు. తాను పూర్తిగా దర్యాప్తుకు సహకరిస్తానని..ఏ తప్పూ చేయని తనను ఈ కేసులో సీఎం జగన్ కావాలనే ఇరికించారనీ..కానీ తాను భయపడేది లేదని విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీటెక్​ రవి ఇప్పటికే తెలిపారు.

 2019 మార్చి 15న వివేకా హత్య  తీవ్ర సంచలనం కలిగింది. ఆ రోజు తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో వివేకా మరణించారు. మొదట అతను గుండెపోటు కారణంగా మరణించారనీ..తరువాత ఆయన హత్యకు గురయ్యాడన్న విషయం బయటకు వచ్చింది. ఈ కేసు పలు కీలక మలుపులు తిరుగుతూ కొనసాగుతోంది. ఈ కేసును సిట్ విచారిస్తున్న క్రమంలో సీబీఐకు అప్పగించాలని వివేకా కుటుంబ సభ్యులు కోరటంపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు చేశారు.