మూసీ గేటు కొట్టుకుపోవడంపై స్పందించిన సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : October 6, 2019 / 07:26 AM IST
మూసీ గేటు కొట్టుకుపోవడంపై స్పందించిన సీఎం

శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్దదైన  మూసీ ప్రాజెక్టు ఆరో నంబర్‌ రెగ్యులేటరీ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గేటు కొట్టుకుపోయిన విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. మూసీ ప్రాజెక్టును సందర్శించాలని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఈఎన్సీ మురళీధర్‌ రావును సీఎం ఆదేశించారు.

పరిస్థితుల తీవ్రతను సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి ఫోన్‌లో వివరించారు. తక్షణమే స్పందించిన కేసీఆర్‌ అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. దీంతో అధికారుల బృందం హెలికాప్టర్‌లో సూర్యాపేటకు బయలుదేరనుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రాజెక్టు దగ్గరకు వెళ్లనున్నారు.

హైదరాబాద్ సహా మూసీ పరివాహక ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పై నుంచి వస్తున్న వరదను పూర్థిస్థాయిలో అంచనావేయకపోవడం వల్లే గేటు కొట్టుకుపోయిందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.