తెలంగాణ జీవనాడి కాళేశ్వరం : త్వరలోనే గ్రీన్ సిగ్నల్

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 03:53 AM IST
తెలంగాణ జీవనాడి కాళేశ్వరం : త్వరలోనే  గ్రీన్ సిగ్నల్

కన్నేపల్లి  :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనుంది. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు..విశేషాలేమిటో చూద్దాం..

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రానున్న వర్షాకాలానికే గోదావరి నీటిని ఎత్తిపోతలతో యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సమాంతరంగా మరో బృహత్‌ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మేడిగడ్డ నుంచి  రెండు టీఎంసీల (రోజుకు) నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం పనులు కొనసాగిస్తోంది. ఇప్పుడు మూడవ  టీఎంసీ నీటిని కూడా తరలించేందుకు దృష్టి పెట్టింది. దీనికి కావాల్సిన నివేదికలను కూడా రెడీ చేస్తోంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటి తరలింపునకు ఇప్పటికే సివిల్‌ పనులు కొనసాగుతున్నాయి.  అదనంగా పంపులు, మోటార్లు బిగించేందుకు అవసరమైన లెక్కలు వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు, అటునుంచి మల్లన్న సాగర్‌ వరకు నీటిని తరలించే మార్గాలు, దానికి అయ్యే ఖర్చులు వంటి పలు అంశాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. 
 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు..మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు  కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం.ఆయకట్టుకు అవసరమయ్యే నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు..వ్యాపారాల అవసరాలకు కలిపి 225 టీఎంసీలు అవసరం కాగా..ఇందులో 180 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా మళ్లించారు. ప్రస్తుతం 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్‌ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు రెండు టీఎంసీలు తరలించేలా ప్రస్తుత ప్రణాళిక ఉంది. అయితే ప్రభుత్వం మిడ్‌మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన’పథకాన్ని చేపట్టింది. దీంతో మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ మొదలుకుని.. గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వరకు ఒక టీఎంసీ నీరు మాత్రమే లభ్యతగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి రెండు టీఎంసీల నీటిని అందించాని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో  భవిష్యత్తు అవసరాలకు మూడో టీఎంసీ అవసరమున్న క్రమంలో దానికి సంబంధించిన అన్ని పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. 
 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల పరిధిలో 15 మోటార్లు అదనంగా అమర్చనున్నారు. ఇప్పుడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వీటికి అదనంగా రూ.1600కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన తాళ్లకొత్తపేట నుంచి వరద కాల్వ 92 కి.మీ. పాయింట్‌ వద్ద కలిపే వరకు 32 కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల మేర అప్రోచ్‌ చానల్, దాదాపు 17 కిలోమీటర్ల టన్నెల్, అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణానికి రూ.10,500 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. 

 

ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు మొదట టన్నెల్‌ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. కానీ దీని నిర్మాణాలకు సమయం ఎక్కువ పట్టే అవకాశముండటంతో ప్రెషర్‌ మెయిన్, పైప్‌లైన్‌లు, గ్రావిటీ కాల్వల ద్వారా నీటిని తరలించేలా తుది చర్యలు సిద్ధమవుతున్నాయి. వీటి తరలింపుకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు..40 నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఈ నిర్మాణానికి రూ.14,500 కోట్ల మేర వ్యయం అవుతుందని  అంచనా వేశారు. అదనపు టీఎంసీ నిర్మాణానికి మొత్తంగా రూ.25వేల కోట్లకు మించి అదనపు వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,500 కోట్లు కాగా, ఈ మొత్తం వ్యయం కలిపితే ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లను దాటనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో భూసేకరణ, ఆర్‌–ఆర్‌ అవసరాలను పక్కన పెడితే కేవలం పనులకు సంబంధించి రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటికే రూ.40వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా నిధులకై రుణాలు తీసుకోగా, అదనంగా అయ్యే వ్యయానికి సైతం రుణాలు తీసుకునే అవకాశాలున్నాయి.