గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి గోడకు ఐటీ నోటీసులు

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 06:17 AM IST
గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి గోడకు ఐటీ నోటీసులు

గ్యాంగ్ స్టర్ నయీం పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన చివరికి పోలీసులు చేతిల్లోనే దారుణంగా ఎన్‌కౌంటర్కు గురైన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే విస్తుపోయారు. భూ కబ్జాలు హత్యలు..బెదిరింపులు, కిడ్నాపులు వంటి దారుణం ఘోరాలకు పాల్పడిన నరరూప రాక్షసుడు నయీం ఆస్తులకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నయీం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. 

నయీం ఎన్ కౌంటర్ తరువాత  అతని కుటుంబ సభ్యులు..స్నేహితులు..సన్నిహితులు అజ్నాతంలోకి వెళ్లిపోయారు. దీంతో  ఇన్ కమ్ ట్యాక్ అధికారులు మంగళవారం (ఫిబ్రవరి 25,2020)న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన నయీం ఇంటి గోడకు నోటీసులు అంటించారు.  

నోటీసులు అందుకోవడానికి అతని కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో అధికారులు భువనగిరిలోని ఖాజీ మహళ్ల చౌరస్తా సమీపంలో ఉన్న నయీం ఇంటిగోడకు ఆ నోటీసులను అతికించారు. నయీం తల్లి తాహెరాబేగం, భార్య హసీనాబేగం, మేనకోడలు సలీమాబేగం,నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనులకు కూడా అధికారులు  నోటీసులు జారీ చేశారు.  

పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నయీంపై అనేక భూకబ్జా కేసులు ఉన్న సంగతి తెలిసిందే. బలవంతంగా ఆక్రమించిన, బెదిరించి లాక్కున్న భూములు, ప్లాట్లను నయీం తన అనుచరులు, కుటుంబసభ్యుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో  గ్యాంగ్ స్టర్ అనుచరులపై కేసులు నమోదు చేసిన అధికారులు దర్యాప్తుకొనసాగిస్తున్నారు. భువనగిరి మండల పరిధిలోని అనంతారం గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన 16 ఎకరాల భూమిని వేర్వేరు వ్యక్తుల పేరున నయీం రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆ బినామీల పేర్లు చెప్పాలని కోరుతూ నయీం కుటుంబసభ్యులు, అనుచరులకు ఐటీ అధికారులు సెక్షన్‌24(1) కింద నోటీసులు జారీ చేశారు.