పంచాయతీ ఎన్నికలు : ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్!

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 02:56 AM IST
పంచాయతీ ఎన్నికలు : ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్!

మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. జనవరి 21న తొలి విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే పలు పంచాయతీలు ఏకగ్రీవమౌతున్నాయి. మరోవైపు మంచిర్యాలలో మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం చర్చనీయాశమైంది. సర్పంచ్ పదవి..వార్డు పదవిలకు కూడా నామినేషన్ పత్రాలు ఎవరూ సమర్పించలేదు. 
గూడెం గ్రామ పంచాయతీ…
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ప్రసిద్ధ సత్యనారాయణ స్వామి పక్కనే గూడెం గ్రామం పంచాయతీ ఉంది. 1987లో ఏజెన్సీ గ్రామంగా ప్రకటించారు. ఇక్కడ ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యుల పోటీకి గిరిజనేతరులు అర్హులు. అయితే..సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో తామెందుకు చేయాలని గిరిజనేతరులు యోచించి ఎవరూ ముందుకు రాలేదు. 1987 నుండి ఇక్కడ 32 ఏళ్లుగా ఇక్కడ ఎన్నిక జరగకపోవడం గమనార్హం. 
నెల్కి వెంకటాపూర్ గ్రామం
నెల్కి వెంకటాపూర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. ఏజెన్సీ గ్రామంగా ఉన్న ఈ పంచాయతీని పునర్ విభజనలో వందుర్ గూడ పంచాయతీగా మార్చారు. ఎస్టీ వర్గంగా మార్చడంతో ఇక్కడ ఎస్టీలు లేకుండా పోయారు. ఎస్టీలను ప్రత్యేక పంచాయతీగా మార్చినా..నెల్కి వెంకటాపూర్‌ను ఏజెన్సీ గ్రామంగా డీనోటిఫై చేయలేదు. ఎస్టీలు లేని పంచాయతీలో ఒక్క నామినేషన్ పత్రం దాఖలు కాలేదు.
వందుర్ గూడ ఏజెన్సీ
ఇక వందుర్ గూడ ఏజెన్సీలో ఎన్నికలను బహిష్కరించారు. ఈ ఏజెన్సీ నెల్కి వెంకటాపూర్ గ్రామం నుండి విడిపోయింది. ఇది అక్కడి వారికి ఇష్టం లేదు. నామినేషన్ల చివరి రోజు శుక్రవారం (జనవరి 18వ తేదీ) ఒక్కరు కూడా నామినేషన్‌లు దాఖలు చేయలేదు.