ఒకరి కోసం ఒకరు : ముగ్గురు చిన్నారులు మృతి

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 04:28 AM IST
ఒకరి కోసం ఒకరు : ముగ్గురు చిన్నారులు మృతి

సంగారెడ్డి జిల్లా హనుమాన్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇళ్ల సమీపంలో నీటి గుంతల దగ్గరకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఆదివారం(ఫిబ్రవరి-24-2019) సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను నివర్ద్‌ కాంబ్లీ(12), వంశీ కృష్ణ(9), సందీప్ సుభాష్‌(9)లుగా గుర్తించారు.

ఉపాధి కోసం వీరి కుటుంబాలు మహారాష్ట్ర నుంచి పదేళ్ల క్రితం హనుమాన్‌నగర్‌ కాలనీకి వలస వచ్చాయి. బహిర్భూమి కోసం ఇంటి దగ్గరే ఉన్న నీటి గుంతల దగ్గరికి ముగ్గురు చిన్నారులు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు సందీప్ నీటి గుంతలో పడిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో మిగతా ఇద్దరు కూడా నీటి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. ఆ ప్రాంతంలో పశువులను మేపుకుంటున్న వారు చిన్నారులు ముగ్గురు గుంతలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

చిన్నారుల తండ్రులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తుండగా..వారి తల్లులు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నట్టు స్థానికులు చెప్పారు. అక్రమ మట్టి తవ్వకాల వల్లే ఈ ఘోరం జరిగిందని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అని ఆరోపించారు. మట్టిని తవ్వుకున్న తర్వాత గుంతల్ని పూడ్చకుండా వదిలివేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు.