సై అంటే సై.. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీకి పార్టీలు సిద్ధం.. అభ్యర్థులు వీరేనా?

  • Published By: naveen ,Published On : October 8, 2020 / 02:49 PM IST
సై అంటే సై.. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీకి పార్టీలు సిద్ధం.. అభ్యర్థులు వీరేనా?

tirupati loksabha bypolls: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప పోరు ఖాయమైంది. సిట్టింగ్ స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలన్న ఫార్ములా తిరుపతి విషయంలో వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీ కూడా ఈ విషయంలో పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదని సమాచారం. దీంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.

భౌగోళికంగా తిరుపతి పార్లమెంట్ స్థానం చాలా పెద్దది. నియోజకవర్గ పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సర్వేపల్లి, నాయుడుపేట, గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన దుర్గాప్రసాద్ ఆఖరి నిమిషంలో వైసీపీలో చేరి, తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు.

బరిలో నాలుగు ప్రధాన పార్టీలు:
రిజర్వ్ స్థానం అయిన తిరుపతి ఉపపోరు బరిలో నాలుగు ప్రధాన పార్టీలు నిలుస్తాయని అప్పుడే ప్రచారం ఊపందుకుంటోంది. అధికార వైసీపీ మాత్రం తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకుంటామనే ధీమాలో ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని, పోటీ జరిగినా గెలుపు నల్లేరుపై నడకే అంటోంది. అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ రావడం లేదు. ఇంతకు ముందులానే అభ్యర్థి నెల్లూరు జిల్లా నుంచే వస్తారని తెలుస్తోంది.

టీడీపీ తరఫున వర్ల రామయ్య లేదా శివప్రసాద్‌ అల్లుడు:
తిరుపతి సీటుపై టీడీపీ సైతం కన్నేసిందని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మి… బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. మాజీ ఎంపీ, దివంగత శివప్రసాద్‌ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోపక్క పనబాక లక్ష్మి బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆమె ఒకవేళ బీజేపీలోకి వెళ్లిపోతే టీడీపీ తరఫున వర్ల రామయ్య లేదా శివప్రసాద్‌ అల్లుడు రంగంలోకి దిగవచ్చని అంటున్నారు.

బీజేపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి..?
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఎన్నికల బరిలో నిలవనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతా మోహన్ పోటీలో ఉంటారని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పలుమార్లు విజయం సాధించిన చరిత్ర చింతా మోహన్‌కు ఉంది. ఇక బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరన్నది క్లారిటీ రావడం లేదు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే పనబాక లక్ష్మిని టీడీపీ నుంచి పార్టీలో చేర్చుకొని టికెట్‌ ఇస్తారనే టాక్ నడుస్తోంది.

సీఎం జగన్ పాలనకు తిరుపతి ఉప పోరు రెఫరెండం:
సీఎం జగన్ పాలనకు తిరుపతి ఉప పోరు రెఫరెండంగా మారనున్నదన్న ప్రచారం మొదలైంది. అందుకే పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏడాదిన్నర పాలనలో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసు గెలుచుకున్నారని, ఈ పోరులో ప్రజలు తమను మళ్లీ ఆశీర్వదిస్తారని వైసీపీ నేతలు అంటున్నారు.

మరోవైపు అధికార ప్రభుత్వ పాలనపై ప్రజలు గుర్రుగా ఉన్నారని, ఈ ఎన్నికలో గట్టిగా బుద్ధి చెబుతారని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ రెండు పార్టీల వ్యవహారంతో విసిగిపోయిన ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ, కాంగ్రెస్ ఆశిస్తున్నాయి. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోరు ఆసక్తికరంగా మారుతుందని అంతా అనుకుంటున్నారు.